అసలు జంబ్లింగ్ అమలయ్యేనా?

అసలు జంబ్లింగ్ అమలయ్యేనా?
  • ఏటా వాయిదా వేస్తున్న అధికారులు 
  • కార్పొరేట్ కాలేజీల కోసమేననే విమర్శలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ లో ఈ ఏడాది కూడా జంబ్లింగ్ పద్ధతి అమలు చేయడం లేదు. వచ్చే ఏడాది జంబ్లింగ్ పద్ధతి అమలు చేస్తామంటూ ప్రతిఏటా చెప్పుకుంటూ వస్తున్న బోర్డు అధికారులు.. ఈసారీ అదే మాట చెప్పారు. గతంలో మాదిరి ఏ కాలేజీ స్టూడెంట్లకు ఆ కాలేజీలోనే ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. వచ్చే నెలలో జరగనున్న ప్రాక్టికల్స్ కోసం ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విధానంతో సర్కారు కాలేజీల స్టూడెంట్లకు నష్టం జరుగుతుందని, కార్పొరేట్ కాలేజీల్లోని స్టూడెంట్లకు లాభం జరుగుతుందనే విమర్శలు వస్తున్నా పట్టించుకుంటలేరు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్స్ జరగనున్నాయి. వీటికి మూడున్నర లక్షలకు పైగా స్టూడెంట్లు హాజరు కానున్నారు. ఇటీవల జరిగిన ఫస్టియర్ పరీక్షల్లో 49% మంది మాత్రమే పాస్ కావడం, జంబ్లింగ్ లో ప్రాక్టికల్స్ నిర్వహిస్తే చాలామంది ఫెయిల్ అయ్యే అవకాశం ఉండడంతో.. ఆ పద్ధతిని అమలు చేసేందుకు అధికారులు భయపడుతున్నారు. అందుకే ఈసారి కూడా జంబ్లింగ్ విధానానికి దూరంగా ఉన్నట్టు ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ ఏడాది కొత్తగా ఇంటర్​కు అప్​గ్రేడ్​అయిన కాలేజీల స్టూడెంట్లకు మాత్రం దగ్గర్లోని సర్కారు కాలేజీల్లో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. కాగా, జంబ్లింగ్ లేకపోవడంతో కార్పొరేట్ కాలేజీలు ఇష్టారాజ్యంగా తమ స్టూడెంట్లకు ఫుల్ మార్కులు వేసుకునే ప్రమాదం ఉంది.  

ప్రాక్టీస్ చేయిస్తలే.. 
కాలేజీల్లో సైన్స్, ఒకేషనల్ స్టూడెంట్లకు జరిగే పబ్లిక్ ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్​కు ముందు చాలా కాలేజీల్లో ప్రాక్టీస్​చేయించడం లేదు. కొన్ని కార్పొరేట్ కాలేజీల్లోని స్టూడెంట్లకు కెమికల్స్ పేర్లు కూడా తెలియట్లేదని లెక్చరర్లే చెబుతున్నారు. ఈ క్రమంలో డీఐఈఓ, జిల్లా నోడల్ ఆఫీసర్లు కాలేజీల్లో తనిఖీలు చేపట్టారు. కానీ తనిఖీలకు వస్తున్నట్టు కాలేజీలకు ముందుగానే చెప్తుండటంతో.. పలు కాలేజీలు రెడీమేడ్ ఏర్పాట్లు చేస్తున్నాయి. దీంతో అంతా సక్రమంగానే ఉన్నట్టు రిపోర్టులు ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

కరోనా వల్లనే.. 
కరోనా కారణంగా ఈ ఏడాది కూడా జంబ్లింగ్ విధానం అమలు చేయడం లేదు. గతంలో మాదిరి ఏ కాలేజీ స్టూడెంట్లకు ఆ కాలేజీలోనే ప్రాక్టికల్స్ నిర్వహిస్తం. పేపర్​ను ఎగ్జామ్ టైమ్​కు అరగంట ముందు ఆన్​లైన్ లో సెంటర్​కు పంపిస్తాం. కార్పొరేట్ కాలేజీలు ఎక్కువ మార్కులు వేసుకుంటాయనే ఆరోపణల నేపథ్యంలో మరింత నిఘా పెడ్తం. 
- ఉమర్ జలీల్, ఇంటర్ బోర్డు సెక్రటరీ

జంబ్లింగ్ పెట్టాలే..   
ఇంటర్ ప్రాక్టికల్స్ లో జంబ్లింగ్ విధానం పెట్టాలి. నీరదారెడ్డి, దయారత్నం కమిటీ కూడా జంబ్లింగ్​లోనే ప్రాక్టికల్స్ నిర్వహించాలని సూచించింది. అయినా సర్కారు పట్టించుకోవడం లేదు. కార్పొరేట్ కాలేజీల దోపిడీని అరికట్టేందుకు జంబ్లింగ్ విధానమే సరైంది.  
- మధుసూదన్​రెడ్డి, ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్