మనుషుల్లారా చూడండీ : బైక్ పై కుక్కకు హెల్మెట్

మనుషుల్లారా చూడండీ :  బైక్ పై కుక్కకు హెల్మెట్

హెల్మెట్ పెట్టుకోండి అంటూ అబ్బే అస్సలు వినరు.. చలానా రాస్తున్నారంటే గల్లీల్లోకి వెళ్లిపోతారు.. ట్రాఫిక్ పోలీస్ ఫొటో తీస్తున్నారు అంటే నెంబర్ ప్లేట్ కు చేతులు అడ్డుపెట్టటం, నెంబర్ కనిపించకుండా రంగు పూయటం వంటి పనులు చేస్తున్నారు బైక్ రైడర్స్. దేశవ్యాప్తంగా హెల్మెట్ లేని వాహనాలకు చలాన్లు పడుతున్న సంఖ్య లక్షల్లో ఉంది. అయితే ఇందుకు భిన్నంగా.. బైక్ పై తన పెంపుడు కుక్కకు కూడా హెల్మెట్ పెట్టి.. వారేవా నువ్వు గ్రేట్ బాస్ అనిపించుకుంటున్నాడు ఈ బైక్ రైడర్. ఆ వివరాలు ఏంటో చూద్దాం...

తమిళనాడు రాష్ట్రం చెన్నై సిటీ నార్త్ వెస్ట్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి.. తన పెంపుడు కుక్కను తీసుకుని బైక్ పై బయటకు వచ్చాడు. రూల్స్ ప్రకారం బండిపై ప్రయాణించే వాళ్లకు హెల్మెట్ మస్ట్.. జంతువులకు కూడా అనే నిబంధన అయితే ఏమీ లేదు.. కాకపోతే తన పెంపుడు కుక్కపై ఉన్న ప్రేమతో.. కుక్కకు కూడా హెల్మెట్ పెట్టాడు రైడర్. ఆ కుక్క హెల్మెట్ పెట్టుకుని.. ముందు రెండు కాళ్లను ఆ రైడర్ భుజాలపైన వేసింది. మిగతా రెండు కాళ్లతో సీట్లో కూర్చుంది. దూరం నుంచి చూస్తే అచ్చం ఆడ మనిషిలాగే ఉంటుంది.. దగ్గరకు వెళ్లి చూస్తే కానీ కుక్క అని గుర్తించలేం.. చెన్నై రోడ్డుపై వెళుతున్న సమయంలో నెటిజన్ల కంట పడింది ఈ వీడియో.. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్ అయ్యింది.

హెల్మెట్ పెట్టుకున్న కుక్క కూడా రైడింగ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించింది. ఈ వీడియో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఎవరిమీదనైనా ప్రేమ ఉంటే.. వారి పట్ల తీసుకునే శ్రద్ధ ఈ విధంగానే ఉంటుందని అంటూ ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని షేర్ చేయగా.. పొడవాటి జుట్టు చూసి లేడీస్ అనుకున్నా.. తీరా చూస్తే కుక్క అని తెలిసి షాక్ అయ్యా అంటూ మరో నెటిజన్ స్పందించాడు. హెల్మెట్ విలువ ఏంటో కుక్కకు పెట్టినప్పుడే.. మనుషులకు తెలుస్తుంది అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. కుక్కకు హెల్మెట్ పెట్టి.. రైడింగ్ చేసే మనుషుల మానవత్వాన్ని టచ్ చేశాడు బాసూ అంటూ మరికొందరు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

హెల్మెట్ ధరించిన కుక్క.. బైక్ రైడర్స్ ను అలర్ట్ చేస్తుందంటూ చెన్నై పోలీసులు అంటున్నారు.