హెచ్ఐవీ పని పడుతున్న ‘డోలూటెగ్రావిర్’
దక్షిణాఫ్రికాలో ‘అడ్వాన్స్’ స్టడీ
ఫలితాలు ఆశాజనకం
మందుకు డబ్ల్యూహెచ్‌వో ఓకే
హెచ్ఐవీ ఎయిడ్స్.. ఎప్పటి నుంచో దీనికి మందు కనిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని మందులున్నా ఆ మొండి వైరస్‌ను పూర్తిగా చంపేంత శక్తి కాదు వాటిది. ఇదిగో.. ఈ మందు దాని భరతం పడుతుందని అంటున్నారు దక్షిణాఫ్రికా సైంటిస్టులు. దాని పేరు ‘డొలుటెగ్రావిర్’. దీనిపై చేసిన క్లినికల్ ట్రయల్స్‌లో ప్రాథమిక ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. దీంతో ఈ మందుపై తర్వాత దశ క్లినికల్ ట్రయల్స్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా పచ్చజెండా ఊపేసింది. జొహెన్నెస్‌బర్గ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ది విట్ వాటర్సాండ్కు చెందిన పరిశోధకుల బృందం చేపట్టిన ఈ ‘అడ్వాన్స్ స్టడీ’ వచ్చే ఏడాది పూర్తి కానుంది. వీరు జోహెన్నెస్‌బర్గ్‌లోని నల్లజాతి ఎయిడ్స్ రోగులు, ముఖ్యంగా వారిలో 60 శాతం మంది మహిళలపై పరిశోధన చేశారు. ఈ మహిళలంతా సగటున 32 ఏండ్ల వయసులో ఉన్నారు. మరో 40 శాతం మందిని జింబాబ్వే, ఇతర సబ్ సహారన్ ఆఫ్రికా ప్రాంతాలకు చెందిన వారిని ఎంపిక చేసుకున్నారు.
పరిశోధనలో ఏం తేలింది?
సౌతాఫ్రికాలో యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్ ప్రారంభించే రోగులకు ప్రభుత్వ యాంటీ రిట్రో వైరల్థెరపీ (ఏఆర్టీ) ప్రోగ్రాం కింద ఎఫావిరెంజ్మందును వాడుతున్నారు. కానీ, హెచ్ఐవీ దీనికి చాలా ఈజీగా రెసిస్టెన్స్ ఏర్పర్చుకుని, మొండిగా మారిపోతోంది. దీనివల్ల సైడ్ఎఫెక్ట్స్ఎక్కువ. దాని రేటూ ఎక్కువే. దానికన్నా డొలుటెగ్రావిర్ మేలైన మందు కానుందని భావిస్తున్నారు. దీనిని ఇతర మందులతో కలిపి తయారు చేయడమూ చాలా ఈజీ కాబట్టి ఖరీదు కూడా తక్కువగా ఉందని చెబుతున్నారు. ఎఫావిరెంజ్తోపాటు టీనోఫోవిర్ డైసోప్రాక్సిల్ ఫ్యూమరేట్(టీడీఎఫ్), టీనోఫోవిర్ అలఫినమైడ్ ఫ్యూమరేట్(టీఏఎఫ్) వంటి మందులతోనూ దీనిని పోల్చి చూడగా మంచి ఫలితాలు వచ్చాయి. ఇంతకుముందు డోలూటెగ్రావిర్మందుతో అమెరికా, యూరప్ దేశాల్లో 3 వేల మందిపై పరిశోధనలు జరిగాయి.
అయితే, దక్షిణాఫ్రికా లాంటి భిన్నమైన జాతి ప్రజలకు ఈ ఫలితాలను ఆపాదించడం సరికాదు కాబట్టి, ఇక్కడ కొత్తగా అధ్యయనం ప్రారంభించారు. దీంతో డొలుటెగ్రావిర్ కూడా ఎఫావిరెంజ్లాగే వైరస్‌ను సమర్థంగా అణచివేస్తోందని తేలింది. కొంతమందిలో వైరల్ లోడ్అసలు గుర్తించలేని స్థాయికి పడిపోతోందని కూడా తేలింది. అయితే, దీన్ని వాడటం వల్ల కొంతమందిలో బరువు పెరగడం అనేది కాస్త ప్రతికూలమైన విషయంగా మారింది. ఈ విషయంపైనా పరిశోధకులు దృష్టి సారించారు. అలాగే, ఎయిడ్స్‌వ్యాధి అడ్వాన్స్‌డ్ స్టేజీలో ఉన్న రోగులకు, గర్భిణులు లేదా బిడ్డలకు పాలిస్తున్న తల్లులు, హెచ్ఐవీతో పాటు టీబీ ఉన్నవారు, పిల్లలు, వృద్ధులకు ఈ మందు ఎలా పనిచేస్తుంది? సైడ్ఎఫెక్ట్స్ మాటేమిటి? అన్నది తేల్చేందుకు తర్వాత దశ పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ దశలో కూడా మంచి ఫలితాలు వస్తే ఇక ఈ మందును ప్రపంచవ్యాప్తంగాఏఆర్టీ ప్రోగ్రాం కింద ఉపయోగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
