
మెహిదీపట్నం, వెలుగు: ఓ మహిళ తాను పని చేస్తున్న ఇంట్లోనే ఆభరణాలు చోరీ చేసింది. నిందితురాలిని అరెస్ట్చేసినట్లు సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ తెలిపారు. టోలిచౌకి పోలీస్స్టేషన్లో ఆదివారం వివరాలు వెల్లడించారు. టోలిచౌకిలోని పాలడుగు వైదేహి ఇంట్లో ఫిలింనగర్ కు చెందిన లక్ష్మి నాలుగు నెలలుగా వంట పని చేస్తోంది.
శుక్రవారం వైదేహి పూజ గదిలో పెట్టిన 7 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు లక్ష్మిపై అనుమానం రావడంతో ఆమెను ప్రశ్నించారు. నేరాన్ని ఒప్పుకోవడంతో ఆభరణాలు స్వాధీనం చేసుకొని, ఆమెను అరెస్ట్చేశారు. ఏసీపీ సయ్యద్ ఫయాజ్, టోలిచౌకి సీఐ రమేశ్ నాయక్ తదితరులున్నారు.