గ్రామం చిన్నది..లక్ష్యం పెద్దది 

గ్రామం చిన్నది..లక్ష్యం పెద్దది 

అదో చిన్న గ్రామం.. ఒకప్పుడు నీటి కష్టాలతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయించుకునే దుస్ధితి ఆ పల్లె వాసులది. వర్షాభావ పరిస్ధితులు ఏర్పడితే సాగునీటికీ, తాగునీటికీ రెండింటికీ కటకటే.. అలాంటి పరిస్ధితి నుంచి నీటి పొదుపులో ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం దోన్‍పాల్ గ్రామస్థులు. 15 వందల జనాభా ఉన్న ఈ గ్రామం ఇప్పుడు నీటి పొదుపులో ఇతర జిల్లాలకే ఆదర్శంగా నిలుస్తోంది. చెరువులనే ధ్వంసం చేసి కబ్జాలకు పాల్పడుతున్న ఈ రోజుల్లో ఈ గ్రామస్తులు మాత్రం చెరువులను అభివృద్ది చేస్తూ భూగర్భ జలాలను పెంచుతున్నారు. వర్షపు నీటిని  ఒడిసిపట్టేందుకు1995 లో రు. 21లక్షల నా బార్డు నిధులతో  ఇంకుడు గుంతలు, చెక్ డ్యాం లు, ఫాంపాండ్స్ నిర్మించారు. ఎత్తు నుంచి పల్లానికి వచ్చే వర్షపు నీటికి అడ్డుకట్ట వేసి ఆపేశారు. ఆ నీటిని భూమిలోకి ఇంకించేలా ఊరు చుట్టూ 19 చెరువులు తవ్వించారు. గ్రామం చుట్టూ చెరువులు తవ్వించాక ఆ గ్రామ రూపు రేఖలే మారిపోయాయి.  జిల్లావ్యాప్తంగా సాగు నీటికి ఇబ్బందులు ఏర్పడినప్పటికీ  ఈ గ్రామంలో మాత్రం నీటి కటకట ఏర్పడలేదంటున్నారు.  గ్రామస్తులు. ఇలా 20 ఏళ్లుగా నీటిని పొదుపు చేస్తూ .. జల  భగీరథులుగా మారారు దోన్ పాల్ గ్రామస్ధులు. గొలుసు కట్టు చె రువుల నిర్మాణంతో గ్రామం చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలోని చుట్టు పక్కల గ్రామాలకు భూగర్భ జలాలు  పెరిగాయని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో చెరువుల్లోకి కొత్త నీరు వచ్చి చే  రుతుండటంతో రైతన్నల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

భూగర్భజలాలు పెరిగాయి..

మా గ్రామంలో 1995 వ సంవత్సరం కంటే ముందు నీటి కరువుఏర్పడడంతో, గ్రామస్తులమందరం ఐక్యంగా నాబార్డ్ నిధులతో ఊరి చుట్టూ 14 కుంటలు, చెరువులు నిర్మించుకున్నాం. భూమ్మీద పడ్డ ప్రతి వర్షపు చి నుకు ఉపయోగపడాలనే ఆలోచనతో ఈ ఫాం పాండ్స్ నిర్మించుకున్నాం .
గుట్టలపైనుంచి వచ్చే వరద నీరు కూడా ఇంకుడు గుంతలలో చేరి ఇంకి పోయేలా ఏర్పాట్లు చేసుకున్నాం . దీంతో మా గ్రామ పరిధిలో  భూగర్భజలాలు పెరిగాయి. సాగు నీటి సమస్య తీరింది. –దేవన్న, సర్పంచ్, దోన్‍పాల్ గ్రామం