బేషరతుగా లొంగిపోవాల్సిందే... ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

బేషరతుగా లొంగిపోవాల్సిందే... ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

దుబాయ్, వాషింగ్టన్: చర్చలేమీ లేకుండా ఇరాన్ బేషరతుగా తమకు లొంగిపోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. బేషరతుగా లొంగిపోతే తప్ప ఆ దేశంతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు శుక్రవారం ఆయన 'ట్రూత్ సోషల్'లో పోస్ట్ పెట్టారు. "ఇరాన్ మాకు బేషరతుగా లొంగిపోవాల్సిందే. ఆ తర్వాతే చర్చలుంటాయి. ఇరాన్ తదుపరి సుప్రీం ఎంపికలో మా పాత్ర కూడా ఉండాలి.  

ఒక నాయకుడిని ఎంచుకున్న తర్వాత ఆ దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తాం. మరింత శక్తివంతంగా మార్చేందుకు అమెరికా,దాని మిత్రదేశాలు సాయం చేస్తాయి. మొజ్తబా ఖమేనీను సుప్రీంగా మేం అంగీకరించం" అని స్పష్టం చేశారు. కాగా.. ఓ వైపు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు లెబనాన్ రాజధాని బీరుట్, ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. మరోవైపు ఇరాన్ కూడా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ప్రతీకార దాడులను ఉధృతం చేసింది. 

ఈ యుద్ధం పదికి పైగా దేశాలకు విస్తరించడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. యుద్ధం ఇప్పటికిప్పుడు ముగిసినా సాధారణ స్థితికి రావడానికి వారాల నుంచి నెలల సమయం పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. 
ఖతార్‌లోని అతిపెద్ద గ్యాస్ ప్లాంట్‌పై ఇరాన్ చేసిన డ్రోన్ దాడి దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

తర్వాతి టార్గెట్​ క్యూబానే

క్యూబాకు ట్రంప్ వార్నింగ్‌ ఇచ్చారు. ఇరాన్‌పై యుద్ధం ముగిసిన తర్వాత తన  నెక్స్ట్‌టార్గెట్‌ క్యూబానేనని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఇరాన్‌తో జరుగుతున్న సంఘర్షణను ముగించడమే తమ తక్షణ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మేజర్ లీగ్ సాకర్ చాంపియన్స్ ‘ఇంటర్ మయామి సీఎఫ్' గౌరవార్థం వైట్ హౌస్‌లో జరిగిన వేడుకల్లో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘‘ముందుగా  ఇరాన్‌ పని పూర్తి చేయాలనుకుంటున్నాం. ఆ తర్వాత క్యూబా వంతు వస్తుంది. మీరు, ఎంతోమంది అద్భుతమైన వ్యక్తులు తిరిగి క్యూబాకు వెళ్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి..దానికి టైం రావాలి అంతే”అని వ్యాఖ్యానించారు.  

ఇరాన్‌ ను వేగంగా అణచివేస్తున్నం..

ఇజ్రాయెల్‌ దళాలతో కలిసి అనుకున్న దానికంటే వేగంగానే తమ దళాలు ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తున్నాయని ట్రంప్‌ తెలిపారు. శత్రువును వేగంగా అణచివేస్తున్నామని పేర్కొన్నారు. వరుస దాడుల వల్ల ఇరాన్ సైనిక సామర్థ్యాలు కూడా భారీగా క్షీణించాయన్నారు. 

ఈ దాడులను ఎదుర్కోవడానికి వారికి తమలా ఎయిర్‌‌ఫోర్స్‌గానీ, ఎయిర్‌‌ డిఫెన్స్‌ సిస్టమ్‌గానీ లేవని తెలిపారు. యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ నాయకులు ఇప్పుడు చర్చల కోసం ప్రయత్నిస్తున్నారని ట్రంప్ వెల్లడించారు.