ట్రంప్, మస్క్​ మధ్య ముదురుతున్న కయ్యం..మస్క్ కాంట్రాక్టులన్నీ రద్దు చేస్తానన్న ట్రంప్​

ట్రంప్, మస్క్​ మధ్య ముదురుతున్న కయ్యం..మస్క్ కాంట్రాక్టులన్నీ రద్దు చేస్తానన్న ట్రంప్​
  • మస్క్ కాంట్రాక్టులన్నీ రద్దు చేస్తానన్న ట్రంప్​
  • ఆయన కంపెనీకి ఇచ్చే రాయితీలు ఎత్తేస్తానని వార్నింగ్​
  • దీటుగా స్పందించిన ఎలాన్​ మస్క్​.. డ్రాగన్ స్పేస్​క్రాఫ్ట్‌‌‌‌ను డీకమిషన్ చేస్తానని హెచ్చరిక

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మధ్య రోజురోజుకూ వివాదం ముదురుతున్నది. ఇప్పటి దాకా సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఇప్పుడు.. మస్క్ కంపెనీలకు  కాంట్రాక్టులన్నీ రద్దు చేస్తానని ట్రంప్ వార్నింగ్ ఇచ్చేదాకా వెళ్లింది. ఫోన్​లో మాట్లాడుకునేందుకు కూడా ఇద్దరూ ఇష్టపడం లేదు. ట్రంప్​ను ఉద్దేశిస్తూ మస్క్ బహిరంగ విమర్శలు చేస్తున్నారు. తాను లేకపోతే ట్రంప్ ఓడిపోయేవాడంటూ ఆయన సంచలన కామెంట్లు చేశారు.  సెక్స్ కుంభకోణం కేసులోని నిందితుడితో ప్రెసిడెంట్​కు సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపించారు. దీంతో ట్రంప్ కూడా దీటుగానే స్పందించారు. మైండ్ లేని మస్క్​తో మాటలేంటి అంటూ ఘాటుగానే విమర్శించారు. మస్క్ ఓ పిచ్చోడు అంటూ ఫైర్ అయ్యారు. ఎలాన్ మస్క్‌‌కు చెందిన స్పేస్‌‌ ఎక్స్‌‌తో సహా అతని కంపెనీలకు సంబంధించిన గవర్నమెంట్ కాంట్రాక్టులన్నీ రద్దు చేస్తానని బెదిరించారు. ‘‘ఎలాన్ మస్క్​కు ఇస్తున్న రాయితీలు ఎత్తేస్తే అమెరికా బడ్జెట్​లో బిలియన్ల డాలర్లు ఆదా అవుతాయి. బైడెన్ దీన్ని ఎందుకు చేయలేదని నేను ఎప్పుడూ ఆశ్చర్యపోయేవాడిని’’అంటూ సోషల్ మీడియా ప్లాట్​ఫామ్ ‘ట్రూత్ సోషల్‌‌’లో ట్రంప్ పోస్టు పెట్టారు. 

రూ.21 వేల కోట్లు విరాళంగా ఇచ్చిన: మస్క్

కాంట్రాక్టులన్నీ రద్దు చేస్తాన్న ట్రంప్ బెదిరింపులపై ఎలాన్ మస్క్ ‘ఎక్స్’ వేదికగా ఘాటుగా స్పందించారు. ట్రంప్ ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’పై తీవ్ర విమర్శలు చేశారు. ఎలక్షన్ క్యాంపెయిన్​కు తాను రూ.21వేల కోట్లకు పైగా విరాళం ఇచ్చానని చెప్పారు. ఆ సాయం చేయకపోయి ఉంటే ట్రంప్ ఓడిపోయి ఉండేవాడని తాజాగా మళ్లీ గుర్తు చేశారు. తన కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలన్నీ ట్రంప్ రద్దు చేస్తే.. స్పేస్‌‌ఎక్స్ తన డ్రాగన్ స్పేస్‌‌ క్రాఫ్ట్‌‌ను వెంటనే డీకమిషన్ చేయడం ప్రారంభిస్తుందని ప్రకటించారు. ఈ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ నాసా కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)కు అస్ట్రోనాట్స్, కార్గో ట్రాన్స్​పోర్ట్​కు ఎంతో కీలకమైందన్న విషయం ట్రంప్ గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. కాగా, ఈ కాంట్రాక్ట్ విలువ రూ.4 లక్షల కోట్లు (5 బిలియన్ డాలర్లు). ట్రంప్, మస్క్ ఇంకొన్ని రోజులు వేచి చూడాలని ఎక్స్​లో ఓ యూజర్ సలహా ఇచ్చాడు. దీంతో మస్క్ కొద్దిగా వెనక్కి తగ్గారు. డీ కమిషన్ నిర్ణయాన్ని కొన్ని గంటల్లోనే విరమించుకున్నారు. ‘‘సరే.. మేము డ్రాగన్​ను డీ కమిషన్ చేయం’’అని మస్క్ పోస్టు పెట్టారు. కాగా, ఒకప్పుడు ఫ్రెండ్స్ గా ఉన్న ట్రంప్, మస్క్.. ఇప్పుడు వార్నింగ్​లు ఇచ్చుకునే దాకా వెళ్లారు.

లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు

స్పేస్‌‌ఎక్స్.. నాసాతో సుమారు రూ.12 లక్షల కోట్లు (15 బిలియన్ డాలర్లు) విలువ చేసే కాంట్రాక్టులు చేసుకున్నది. అమెరికా ప్రభుత్వంతో ఎలాన్ మస్క్ కంపెనీలు మొత్తం రూ.21 లక్షల కోట్లు (22 బిలియన్ డాలర్లు) విలువైన కాంట్రాక్టులను కలిగి ఉన్నది. 2030లో ఐఎస్ఎస్ ను డీ ఆర్బిట్ చేయడానికి స్పేస్‌‌ క్రాఫ్ట్ డెవలప్ కాంట్రాక్ట్ కూడా స్పేస్ ఎక్స్ వద్దే ఉన్నది. స్పేస్​ఎక్స్, నాసా మధ్య ఒప్పందాలన్నీ రద్దయితే.. అమెరికా స్పేస్ ప్రోగ్రామ్​కు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. నాసా ప్రెస్ సెక్రటరీ బెథనీ స్టీవెన్స్ ఈ వివాదంపై స్పందించారు. నాసా అధ్యక్షుడి స్పేస్ లక్ష్యాలను అమలు చేయడంపై దృష్టిపెడ్తామన్నారు. తమ భాగస్వాములతో కలిసి 
ముందుకెళ్తామన్నారు. నాసాతో స్పేస్ ఎక్స్​ సహకారం కొనసాగించాలని కోరారు.

టెస్లా ఇన్వెస్టర్లకు రూ.13 లక్షల కోట్లు లాస్‌‌‌‌

ట్రంప్‌‌‌‌, మస్క్ మధ్య గొడవ ముదరడంతో  టెస్లా షేర్లు గురువారం 14 శాతం వరకు పతనమయ్యాయి.  ఫలితంగా ఈ కంపెనీలో డబ్బులు పెట్టిన ఇన్వెస్టర్లు 150 బిలియన్ డాలర్లు (రూ.13 లక్షల కోట్లు) నష్టపోయారు.  టెస్లా షేర్లు గురువారం 14.26 శాతం పతనమైన ఒక్కో షేర్ 284.70 డాలర్ల వద్ద క్లోజ్ అయ్యింది.  గత ఐదు సెషన్స్‌‌‌‌లో నాలుగు సార్లు టెస్లా షేర్ ధర పడిపోయింది.  ట్రంప్, మస్క్ మధ్య వాగ్వాదం స్టార్ట్ అయిన తర్వాత నుంచి టెస్లా షేర్లను ఇన్వెస్టర్లు అమ్మేస్తున్నారు.  కంపెనీ షేర్లు శుక్రవారం సెషన్‌‌‌‌లో మాత్రం 4 శాతం లాభంతో ట్రేడయ్యాయి.