ఇండియాపై ప్రతీకార పన్ను వేస్తా : ట్రంప్

ఇండియాపై ప్రతీకార పన్ను వేస్తా  : ట్రంప్

వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున 2024లో అమెరికా అధ్యక్షుడిగా గెలిచి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇండియాపై ప్రతీకార పన్ను వేస్తానని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికన్ ప్రొడక్ట్స్​పై ఇండియా భారీగా పన్ను వసూలు చేస్తున్నదని మండిపడ్డారు. హార్లే -డేవిడ్‌‌‌‌సన్‌‌‌‌ లాంటి ఉత్పత్తులపై పెద్ద మొత్తంలో టారిఫ్‌‌‌‌లు విధిస్తున్నదని అన్నారు. 

ఫాక్స్ బిజినెస్ న్యూస్ చానెల్​తో ట్రంప్ మాట్లాడుతూ ఇండియాపై ఈ మేరకు అక్కసు వెళ్లగక్కారు. ‘‘హార్లే డేవిడ్​సన్ లాంటి బైక్​లపై ఇండియా 100 శాతం, 150 శాతం, 200 శాతం పన్ను విధిస్తున్నది. ఇది సరికాదు. అమెరికన్ కంపెనీలు ఎలా వ్యాపారం చేయగలవు. యూఎస్ కంపెనీలు అక్కడికొచ్చి ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఇండియా కోరుకుంటున్నది. అప్పుడే ఎలాంటి పన్నులు ఉండవని భావిస్తున్నది. ఇలా చాలా అమెరికన్ వస్తువులపై ఇండియా భారీగా ట్యాక్స్​ వేస్తున్నది”అని ట్రంప్​ మండిపడ్డారు. 

మేం ట్యాక్సులు అలా వేయట్లే.. 

ఇండియాలో తయారైన మోటర్​బైక్​లపై అమెరికా ఎలాంటి పన్ను విధించడం లేదని ట్రంప్​ అన్నారు. కానీ, తాము తయారు చేసిన హార్లే డేవిడ్​సన్ బైక్ ఇండియాలో అమ్ముకోవాలంటే భారీగా ట్యాక్స్ చెల్లించాల్సి వస్తున్నదని తెలిపారు. ఇదెక్కడి న్యాయం అని ఆయన ప్రశ్నించారు. ‘‘హార్లే డేవిడ్​సన్ బైక్​లపై విధిస్తున్న టారిఫ్​ల కారణంగా ఇండియాలో ఎవరూ ఆ బైక్​  కొనడం లేదు. మన వస్తువులపై ఇండియా పన్ను వసూలు చేస్తున్నప్పుడు.. ఇండియా వస్తువులపై మనం టారిఫ్​ విధించకూడదా? 200  శాతం పన్ను ఇండియా విధిస్తుంటే.. మేం 100 శాతం లేదంటే కనీసం 50శాతం.. 20శాతం.. 10 శాతం.. కూడా వేయొద్దా?” అని ట్రంప్ ప్రశ్నించారు.