డొనాల్డ్​ ట్రంప్‌ కామెంట్లను తిప్పికొట్టిన జనం

డొనాల్డ్​ ట్రంప్‌ కామెంట్లను తిప్పికొట్టిన జనం

వాషింగ్టన్: అమెరికా మాజీ ప్రెసిడెంట్, రిపబ్లికన్​ పార్టీ ప్రెసిడెన్షియల్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్​కు భంగపాటు ఎదురైంది. ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్​పై చేసిన తీవ్రమైన కామెంట్లు తనకే ఎదురుతగిలాయి. శనివారం వాషింగ్టన్​లోని లిబర్టేరియన్ పార్టీ నేషనల్ కన్వెన్షన్‌లో రిపబ్లికన్ ప్రెసిడెంట్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా బైడెన్​పై ‘నియంత’ అంటూ విమర్శలు చేశారు. అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్షుడు బైడెన్ అంటూ ట్రంప్ చేసిన కామెంట్లను అ కార్యక్రమానికి హాజరైన జనం తిప్పికొట్టారు.

దేశంలోనే అత్యంత చెత్త ప్రెసిడెంట్ నువ్వేనంటూ జనం కేకలు వేశారు. ఒక్కసారిగా పెద్దపెట్టున కేకలు వేయడంతో ట్రంప్ బిక్కమొహం వేశారు. అలాగే, కరోనా విపత్తును ఎదుర్కొవడంలో ట్రంప్ విఫలమయ్యాడని, ఆయన పొలిటికల్ రికార్డ్ కూడా దారుణమని నినాదాలు చేశారు. ట్రంప్ ఓ అబద్ధాల కోరు అంటూ ప్రసంగానికి పదేపదే అడ్డుతగిలారు. పార్టీ వేదికలు, పార్టీ తరఫున తను ఏర్పాటు చేసిన సభల్లో మద్దుతుదారుల మధ్య ప్రసంగించే ట్రంప్​కు.. ఒక్కసారిగా తనను వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తున్న వారి మధ్య ప్రసంగించడం కొంత ఇబ్బందికరంగా మారింది.

గందరగోళ వాతావరణం ఉన్నప్పటికీ, డొనాల్డ్ ట్రంప్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ‘‘నేను ఇదివరకు లిబర్టేరియన్​(స్వేచ్ఛావాది) కానట్లయితే, నేను ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా లిబర్టేరియన్ అని చెప్పవచ్చు”అని ప్రస్తుతం సభలో తనకు ఎదురైన పరిస్థితిని చూపుతూ పేర్కొన్నారు. అలాగే, లిబర్టేరియన్ల మనసు గెలుచుకునేందుకు తన క్యాబినెట్‌లో ఒక లిబర్టేరియన్​కు చోటు ఇస్తానని డొనాల్డ్ ట్రంప్​ హామీ ఇచ్చారు.