
- జీనియస్ యాక్ట్‌పై సంతకం చేసిన ట్రంప్
న్యూఢిల్లీ: దేశాలు విడుదల చేసే డిజిటల్ కరెన్సీల కంటే క్రిప్టోలకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొగ్గు చూపారు. యూఎస్ డాలర్ వంటి అసెట్స్‌తో లింకై ఉన్న స్టేబుల్ కాయిన్స్‌ను కంట్రోల్ చేసేందుకు "గైడింగ్ అండ్ ఎస్టాబ్లిషింగ్ నేషనల్ ఇన్నోవేషన్ ఫర్ యూఎస్ స్టేబుల్‌కాయిన్స్ యాక్ట్" (జీనియస్ యాక్ట్) ను చట్టంగా మార్చారు.
వైట్ హౌస్ ప్రకారం,ఈ చట్టం గ్లోబల్ డిజిటల్ కరెన్సీ రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని బలోపేతం చేయనుంది. జీనియస్ యాక్ట్‌ను చట్టంగా మార్చేందుకు శుక్రవారం ట్రంప్ సంతకం చేశారు. “జీనియస్ యాక్ట్..నా పేరు మీద పెట్టారు. ఇది అద్భుతమైన చట్టం” అని కామెంట్చేశారు. ఇంటర్నెట్ ఆవిర్భావం తర్వాత ఆర్థిక సాంకేతిక రంగంలో వచ్చిన అతిపెద్ద విప్లవాత్మక చట్టం ఇదని ఆయన అన్నారు.
గ్లోబల్ ఫైనాన్స్‌లో తన ఆధిపత్యాన్ని అమెరికా సుస్థిరం చేసుకుంటుందని పేర్కొన్నారు. ఈ చట్టంతో క్రిప్టో పేమెంట్స్‌లో డాలర్ పాత్ర పెరుగుతుందని అంచనా.
జీనియస్ చట్టంలో ఏముంది?
ప్రస్తుతం ఉన్న స్టేబుల్ కాయిన్ల మార్కెట్ వాల్యూ 250 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. స్టేబుల్ కాయిన్లు ఒక రకమైన క్రిప్టో కరెన్సీలు. ఈ కాయిన్లను ఇష్యూ చేసే పర్మిటెడ్ పేమెంట్ స్టేబుల్‌కాయిన్ ఇష్యూయర్స్ (పీపీఎస్‌ఐ) సంస్థలు కచ్చితంగా 1:1 రేషియోలో రిజర్వ్‌లను మెయింటైన్ చేయాలి.
అంటే ఒక స్టేబుల్ కాయిన్ ఇష్యూ చేస్తే ఒక డాలర్ రిజర్వ్‌లో ఉండాలి. వీరు తమ నెలవారీ ఆడిట్‌లు, రిడెంప్షన్ పాలసీలను వెల్లడించాలి. ఈ చట్టం జనవరి 2027 నుంచి అమలులోకి వస్తుంది.