భారత్‌‌పై టారిఫ్‌‌ తగ్గిస్త.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

భారత్‌‌పై టారిఫ్‌‌ తగ్గిస్త.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. భారత్‌‌తో న్యాయమైన వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు అతి చేరువలో ఉన్నామని వెల్లడించారు. రష్యన్ ఆయిల్ కొనుగోలును తగ్గించినందుకు భారత్‌‌పై విధించిన టారిఫ్‌‌లను కూడా అతి త్వరలో తగ్గిస్తామని స్పష్టం చేశారు. సోమవారం మధ్యాహ్నం సెర్గియో గోర్‌‌ భారత్‌‌లో అమెరికా రాయబారిగా ప్రమాణం చేశారు. ఓవల్ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొని, మాట్లాడారు. 

"గతంలో చాలా అన్యాయమైన ఒప్పందాలు జరిగాయి. వాటివల్ల అమెరికాకు చాలా ఆర్థిక నష్టం కలిగింది. ఇకపై న్యాయమైన వాణిజ్య ఒప్పందాలనే ఆమోదిస్తం. అందరికీ అంగీకారమైన ఒప్పందం దగ్గరలోనే ఉంది. భారత్‌‌తో ఇకపై మునుపటి కంటే భిన్నమైన ఒప్పందాలు కుదుర్చుకుంటాం. రష్యన్ ఆయిల్ కొంటున్నారని టారిఫ్‌‌లు విధించడంతో ప్రస్తుతం నన్ను భారత్‌‌ ఇష్టపడట్లేదు. 

కానీ, మళ్లీ వారు మనల్ని ఇష్టపడేలా చేస్తాను. భారత్‎కు వాణిజ్య చర్చల్లో చాలా నైపుణ్యం ఉంది. ఈ విషయాన్ని సెర్గియో గుర్తించాలి. భారత్‌‌తో న్యాయమైన వాణిజ్య ఒప్పందానికి చాలా చేరువలో ఉన్నాం. రష్యన్ చమురును కొనడం భారత్ చాలా వరకు తగ్గించింది. అందువల్ల ఏదో ఒక సమయంలో సుంకాలను కచ్చితంగా తగ్గిస్తాం" అని ట్రంప్ పేర్కొన్నారు.