జనవరి వరకు నన్ను క్రికెట్ గురించి అడగొద్దు

జనవరి వరకు నన్ను క్రికెట్ గురించి అడగొద్దు

ముంబై: మాజీ కెప్టెన్‌‌ మహేంద్ర సింగ్‌‌ ధోనీ బ్యాట్‌‌ పట్టేదెప్పుడూ.. బరిలోకి దిగేదెప్పుడూ..? ప్రస్తుతం అందరినీ వేధిస్తున్న ఈ ప్రశ్నకు మహీయే సమాధానమిచ్చాడు. బుధవారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీ.. జనవరి వరకు తనను క్రికెట్‌‌కు సంబంధించిన అంశాలను అడగొద్దని కోరాడు. ‘జనవరి తక్‌‌ మత్‌‌ పూచో’ అంటూ ముక్తసరిగా సమాధానమిచ్చాడు. అంటే జనవరిలో మొదలయ్యే న్యూజిలాండ్‌‌ టూర్‌‌కు మహీ అందుబాటులో ఉంటాడనే ఊహాగానాలు మొదలయ్యాయి. 2007 టీ20, 2011 వన్డే వరల్డ్‌‌కప్‌‌ గెలిచిన తర్వాత తమకు లభించిన స్వాగతాన్ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నామని ధోనీ చెప్పాడు. ఈ రెండు తన హృదయానికి చాలా దగ్గరైన సందర్భాలన్నాడు. ‘టీ20 వరల్డ్‌‌ కప్‌‌ తర్వాత మేం ఇండియాకు తిరిగి వచ్చాం. ఓపెన్‌‌ బస్‌‌లో మమ్ముల్ని ఊరేగింపుగా మెరైన్‌‌ డ్రైవ్‌‌ దగ్గరకు తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ జామ్‌‌ ప్యాక్‌‌ అయిపోయింది. చాలా మంది కార్లలో నుంచి వచ్చి మమ్మల్ని విష్‌‌ చేస్తున్నారు. ఇలాంటి రిసెప్షన్‌‌ను నేను ఊహించలేదు. ఇక రెండో సంఘటన 2011 వరల్డ్‌‌కప్‌‌ ఫైనల్లో జరిగింది. మ్యాచ్‌‌ చివర్లో గెలవడానికి మాకు 15–20 రన్స్‌‌ కావాలి. స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరు లేచి వందేమాతరం అంటూ నినాదాలు చేయడంతో స్టేడియం దద్దరిల్లిపోయింది. ఈ రెండు సంఘటనలను జీవితంలో మర్చిపోలేం’ అని ధోనీ గుర్తు చేశాడు.