ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బందులు కలిగించవద్దు: మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ రెడ్డి

ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బందులు కలిగించవద్దు: మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ రెడ్డి
  • లారీ కాంట్రాక్టర్లు సమస్యలు సృష్టిస్తే బ్లాక్‌‌ లిస్ట్‌‌లో పెడుతాం
  • చివరి గింజ వరకు మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం: మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి
  • నల్గొండ, ఖమ్మం జిల్లాలో కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మంత్రులు ఉత్తమ్‌‌‌‌‌‌‌‌, కోమటిరెడ్డి, లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌, పొంగులేటి

నల్గొండ, వెలుగు: ధాన్యం సేకరణ విషయంలో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ లారీ కాంట్రాక్టర్లు ఇబ్బందులు పెడితే సహించేది లేదని మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి హెచ్చరించారు. లారీల సమస్యను అధిగమించేందుకు అన్ని రకాల వాహనాలను కొనుగోలు కేంద్రాలకు మళ్లించాలని, హమాలీల సమస్య ఎదురవకుండా స్థానిక కూలీలను తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.

శాసనమండలి చైర్మన్‌‌‌‌‌‌‌‌ గుత్తా సుఖేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, నల్గొండ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డితో కలిసి గురువారం కనగల్ మండలం చెట్ల చెన్నారంలోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం నల్గొండ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో ఉమ్మడి జిల్లా ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ... వడ్ల కొనుగోలును స్పీడప్‌‌‌‌‌‌‌‌ చేయాలని, పది రోజుల పాటు అన్ని రకాల లారీలు, వాహనాలను ధాన్యం సేకరణకే వినియోగించుకోవాలని ఆదేశించారు.

కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఆఫీసర్లంతా వారం, పది రోజుల పాటు పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తే ధాన్యం సేకరణ ఇబ్బందులు లేకుండా సాగుతాయని చెప్పారు. యాసంగి ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం రూ.22 వేల కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో 140 లక్షల టన్నుల దిగబడి వస్తుందని అంచనా వేయగా.. ఇందులో 80 నుంచి 90 లక్షల టన్నుల వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయనుందని చెప్పారు. ఇప్పటికే 32 లక్షల టన్నులుకొని రూ.4,800 కోట్లను రైతుల అకౌంట్లలో డిపాజిట్‌‌‌‌‌‌‌‌ చేశామన్నారు.

తడిసిన వడ్లను కొని బాయిల్డ్‌‌‌‌‌‌‌‌ రైస్‌‌‌‌‌‌‌‌ మిల్లులకు పంపించాలని ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ విప్, నకిరేకల్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే వేముల వీరేశం, పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్‌‌‌‌‌‌‌‌ రవీంద్ర, ఎమ్మెల్యేలు బాలునాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, మందుల సామేలు, కుంభం అనిల్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి, కుందూరు జైవీర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, కోటిరెడ్డి, శంకర్‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌, డెయిరీ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ గుత్తా అమిత్ రెడ్డి, నల్గొండ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డితో పాటు రైతు కమిషన్‌‌‌‌‌‌‌‌ సభ్యులు, కలెక్టర్లు, ఎస్పీలు, మార్కెట్‌‌‌‌‌‌‌‌ కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు.

రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: శాసన మండలి చైర్మన్‌‌‌‌‌‌‌‌ గుత్తా సుఖేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి
వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని శాసనమండలి చైర్మన్‌‌‌‌‌‌‌‌ గుత్తా సుఖేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి కోరారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 67 శాతం ధాన్యం సేకరణ పూర్తయిందని చెప్పారు. వడ్లు ఒకేసారి మార్కెట్‌‌‌‌‌‌‌‌కు రావడం వల్ల లారీలు, హమాలీల సమస్య ఏర్పడిందన్నారు. మిల్లర్లు సైతం ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు.

చివరి గింజ వరకు కొంటాం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి
పది రోజుల్లో వడ్ల కొనుగోళ్లు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుందని చెప్పారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి వచ్చాక రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అండగా ఉంటోందన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ రైతు శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌బీసీని పూర్తి చేసి మరింత భూమిని సాగులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని గురువారం మంత్రులు ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణ, తూకం, నాణ్యత, నిల్వ ఏర్పాట్లకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోల్లు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పశ్చిమ బెంగాల్‌‌‌‌‌‌‌‌లో అసెంబ్లీ ఎన్నికలు, బీహార్‌‌‌‌‌‌‌‌లో వ్యవసాయ సీజన్‌‌‌‌‌‌‌‌ పొడిగింపు కారణంగా తెలంగాణలో హమాలీల కొరత ఏర్పడిందన్నారు.

వడ్ల రవాణాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మంత్రులు జిల్లాల వారీగా పర్యటిస్తూ కొనుగోళ్ల ప్రక్రియను సమీక్షిస్తున్నారని చెప్పారు. అనంతరం ఖమ్మం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్‌‌‌‌‌‌‌‌ దివాకర టీఎస్‌‌‌‌‌‌‌‌, సీపీ సునీల్‌‌‌‌‌‌‌‌దత్‌‌‌‌‌‌‌‌, అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పి. శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి, డీఆర్డీవో శ్రీరాం, మార్కెటింగ్ శాఖ అధికారి ఎంఏ. అలీం, సివిల్‌‌‌‌‌‌‌‌ సప్లై ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి డీఎం సునీల్‌‌‌‌‌‌‌‌రెడ్డి, డీసీవో గంగాధర్, డీఏవో పుల్లయ్య పాల్గొన్నారు.