
పద్మారావునగర్, వెలుగు: కరోనా కొత్త వేరియంట్ గురించి భయం అవసరం లేదని, కానీ అప్రమత్తంగా ఉండాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రొ.రాజారావు చెప్పారు. ఒమిక్రాన్బీఎఫ్–7పై బుధవారం ఆయన ‘వెలుగు’తో మాట్లాడారు. చైనాతోపాటు పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో సిటీ ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గాంధీలో ప్రస్తుతం 8 మంది కరోనా పేషెంట్లు ఉన్నారని, వారికి ట్రీట్మెంట్ఇస్తున్నట్లు చెప్పారు. ఆసుపత్రిలో ఆక్సిజన్, ఐసీయూ బెడ్ల కొరత లేదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని.. మాస్కులు ధరించాలని సూచించారు. శానిటైజర్ లేదా సబ్బుతో ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. కిడ్నీ, లివర్, లంగ్స్, డయాబెటిక్ పేషెంట్లు రద్దీ ప్రాంతాల్లో తిరగకపోవడం బెటర్అని చెప్పారు.
ఇద్దరు యువతుల మిస్సింగ్
శంషాబాద్/కంటోన్మెంట్, వెలుగు: సిటీలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు యువతులు ఇంటి నుంచి బయటికి వెళ్లి కనిపించకుండా పోయారు. పోలీసుల వివరాల ప్రకారం.. శంషాబాద్మండలంలోని పాలమాకులకు చెందిన రాజు, రమాదేవిల కూతురు తేజ శ్రీ(20). చదువు మానేసి రెండేండ్లుగా ఇంట్లోనే ఉంటోంది. బుధవారం బయటికి వెళ్లిన యువతి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు బంధువులు, స్నేహితుల వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో తల్లి రమాదేవి శంషాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్‌కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే బోయినపల్లి పోలీస్‌స్టేషన్‌పరిధిలో ఉండే మరో యువతి కనిపించకుండా పోయింది. న్యూ బోయిన్ పల్లికి చెందిన నల్గొండ సరళకు ముగ్గురు పిల్లలు. పెద్ద కూతురు రమ్య(27) బీటెక్ థర్డ్ఇయర్వరకు చదివి మధ్యలోనే ఆపేసింది. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటోంది. ఈ నెల 19న రమ్యకు, బంధువుల అబ్బాయితో ఎంగేజ్మెంట్అయింది. బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని టైంలో బయటికి వెళ్లిన రమ్య తిరిగి రాలేదు. తెలిసినవాళ్లు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ దొరకక పోవడంతో సరళ బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదైంది.
అట్టహాసంగా మొదలైన పత్రీజీ ధ్యాన మహాయాగం
అమనగల్లు, వెలుగు: ధ్యానం సర్వరోగ నివారిణి అని పిరమిడ్ వ్యవస్థాపకుడు బ్రహ్మర్షి పత్రీజీ సతీమణి స్వర్ణమాల, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ చెప్పారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాస్‌పల్లి సమీపంలోని కైలాసపురి పిరమిడ్ లో బుధవారం సాయంత్రం పత్రీజీ ధ్యాన మహాయాగం అట్టహాసంగా ప్రారంభమైంది. 11 రోజులపాటు నిర్వహిస్తున్న మహా యాగాన్ని స్వర్ణమాల, జైపాల్ యాదవ్, పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాఖాహారంతోనే ప్రపంచశాంతి సాధ్యమని, ప్రపంచ శాంతి కోసమే యాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు రాంబాబు, గోపాల్, మాధవి, లక్ష్మి, స్థానిక ప్రజా ప్రతినిధులు, వందల సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి
మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
శామీర్ పేట, వెలుగు: జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం నిరంతరం శ్రమిస్తున్నామని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ చెప్పారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్ అధ్యక్షతన బుధవారం శామీర్ పేట మండలం తూంకుంటలో మేడ్చల్ జిల్లా టీయూడబ్ల్యూజే మహాసభలు ఘనంగా జరిగాయి. చీఫ్ గెస్ట్‌గా అల్లం నారాయణ హాజరై మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అందజేసినట్లు తెలిపారు. సీఎంఆర్ఎఫ్ కింద జర్నలిస్టులకు రూ. 6 కోట్లు వచ్చాయని, కరోనా సోకిన దాదాపు 4 వేల మంది కోసం రూ.7 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఇచ్చినట్లు వివరించారు. కార్యక్రమంలో టెమ్జ్రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి రమణ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ముత్తయ్య గౌడ్, కార్యవర్గ సభ్యుడు వెంకటేశ్ గౌడ్, మేడ్చల్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కోల వెంకటేశ్వర్లు, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, భువనగిరి జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.
ఘనంగా సెంట్రల్ బ్యాంక్ వార్షికోత్సవం
ముషీరాబాద్, వెలుగు: అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ‘సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ ప్రజల విశ్వాసం మీద నడుస్తోందని బ్యాంక్హైదరాబాద్ జోనల్ హెడ్ కేఎస్ఎన్వీ సుబ్బారావు అన్నారు. కాచిగూడలోని మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహం మ్యడం అంజయ్య హాల్లో బుధవారం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో 112వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. చీఫ్‌గెస్ట్‌గా సుబ్బారావు, గౌరవ అతిథిగా బ్యాంక్ రీజినల్ హెడ్ వివేక్ కుమార్ శ్రీవాస్తవ హాజరై మాట్లాడారు. దేశంలో జాతీయం చేయబడిన మొట్టమొదటి వాణిజ్య బ్యాంకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని గుర్తుచేశారు. 112 ఏళ్లుగా దేశంలోని ప్రజలకు సేవలందిస్తోందని కొనియాడారు. బ్యాంకు ఉన్నతాధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్, ఏఎన్ఎంల సస్పెన్షన్
పుల్కల్, వెలుగు: డ్యూటీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలోని పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ రూపెన్ చక్రవర్తి, ఏఎన్ఎం ప్రవీణను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలకు అందుబాటులో లేకుండా నిర్లక్ష్యంగా ఉండేవారిపై వేటు తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు అన్నివేళలా అందుబాటులో ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
చెట్టును ఢీకొట్టిన కారు ఏడుగురికి తీవ్ర గాయాలు
శంషాబాద్ ఎయిర్‌పోర్టు రోడ్డులో ప్రమాదం
శంషాబాద్, వెలుగు: అతివేగం కారణంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు రూట్లో ఓ క్వాలీస్ అదుపు తప్పి డివైడర్ మధ్యలోని చెట్టును ఢీకొని పల్టీలు కొట్టింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి సిటీకి వస్తున్న ఓ క్వాలీస్ వెహికల్ అదుపు రోడ్డు మధ్యలోని స్తంభాన్ని, చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కార్లోని నలుగురు చిన్నారులతోపాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటాన స్థలానికి చేరుకున్న ఎయిర్‌పోర్టు సిబ్బంది, పోలీసులు బాధితులను చికిత్స నిమిత్తం దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఎయిర్‌పోర్టు రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాఫిక్ పోలీస్‌ను నెట్టేసి పరార్
జూబ్లీహిల్స్, వెలుగు: తాగిన మత్తులో ఓ వ్యక్తి ట్రాఫిక్ హోంగార్డును నెట్టేసి పారిపోయిన ఘటన బంజారా హిల్స్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి ఓ స్కూటీపై ముగ్గురు వ్యక్తులు జూబ్లీ చెక్‌పోస్ట్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్తున్నారు. ఎన్టీఆర్ భవన్ ఫ్రీ లెఫ్ట్ వద్ద బండిని ఆపి, వెనుక నుంచి వచ్చే వెహికల్స్పోకుండా చేశారు. అక్కడే విధుల్లో ఉన్న హోంగార్డు విగ్నేశ్ వారి దగ్గరకు వెళ్లి ప్రశ్నించగా వెనకాల ఉన్న ఇద్దరు బండి దిగి పారిపోయారు. స్కూటీకి నంబర్ప్లేట్కూడా లేకపోవడంతో బండి కాగితాలు పరిశీలిస్తుండగా హోంగార్డును నెట్టేసి మూడో వ్యక్తి కూడా పారిపోయాడు. ఇందిరా నగర్ కు చెందిన జయమ్మ అనే మహిళ పేరుపై స్కూటీ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అవినీతిని బయట పెడ్తం
ఎల్బీనగర్, వెలుగు: నియోజకవర్గంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి భూ కబ్జాలకు అడ్డూ అదుపులేకుండా పోతోందని రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా కోర్టు పక్కన ఉన్న సర్వే నంబర్ 13, 14, 15లోని ఎకరం 25 గుంటల ప్రభుత్వ భూమిని సుధీర్ రెడ్డి బినామీ కంపెనీ టీఎన్ఆర్ పేరు మీద రిజిస్టర్ చేయించారని ఆరోపించారు. ప్రభుత్వం ఏదైనా సంస్థ అవసరాలకు ఇచ్చిన భూమిని ఉపయోగించుకోకుండా ఉంటే ఆ భూమిని తిరిగి ప్రభుత్వానికే అప్పజెప్పాల్సి ఉంటుందని, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాత్రం అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారన్నారు. నియోజకవర్గంలో సుధీర్ రెడ్డి కబ్జాలకు కేరాఫ్‌గా మారారని, ఒక్కొక్కటిగా బయటకు
తీస్తామన్నారు.
పెట్రోల్‌లో నీళ్లు
శాయంపేట, వెలుగు: పెట్రోల్‌లో నీళ్లు కలిపి అమ్ముతున్నారంటూ వాహనదారులు బంక్ఎదుట ఆందోళనకు దిగారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని గంగిరేణిగూడెంలో ఆరు నెలల క్రితం ఇండియన్ ఆయిల్ ఆధ్వర్యంలో టీఆర్ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభించారు. బుధవారం ఉదయం పోతు సునీల్, దొంగరి శ్రావణ్, ముక్కెర సురేశ్ బైక్‌లలో పెట్రోల్ పోయించుకున్నారు. బయటకు వెళ్లిన కొద్దిసేపటికే వెహికల్స్ మొరాయించాయి. కల్తీ పెట్రోల్ వల్ల వెహికల్ పాడైందని మెకానిక్ చెప్పడంతో బంక్ వద్దకు చేరుకున్నారు. ఖాళీ బాటిల్ లో పెట్రోల్ పోయించగా 90 శాతం నీరు, 10 శాతం మాత్రమే పెట్రోల్ రావడంతో కంగుతిన్నారు. పెట్రోల్‌లో నీరు ఎలా కలిసిందో తనకు తెలియదని బంక్ యజమాని శ్రీనివాస్ చెప్పాడు. పెట్రోల్ ట్యాంకులో టెక్నికల్ సమస్య వల్ల ఇథనాల్ సపరేట్ అయిందని సేల్స్ ఆఫీసర్ ప్రతాపరెడ్డి చెప్పారు. బంకును సందర్శించి సమస్యను పరిష్కరిస్తామన్నారు.
పాడె మోసి.. బస్వాపురం నిర్వాసితుల నిరసన
యాదాద్రి, వెలుగు: మూడేండ్లుగా ఎదురు చూస్తున్నా పరిహారం రాకపోవడంతో బస్వాపురం నిర్వాసితులు లీడర్ల ఫోటోలు అతికించిన పాడెను మోసి నిరసన వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లాలో నిర్మిస్తున్న బస్వాపురం రిజర్వాయర్ కారణంగా బీఎన్ తిమ్మాపురం గ్రామం మునిగిపోతోంది. మూడేండ్ల కింద ప్రకటించిన అవార్డ్ప్రకారం ఇప్పటివరకు పరిహారం ఇవ్వపోవడంతో 23 రోజులుగా బీఎన్ తిమ్మాపురం వాసులు రిజర్వాయర్ కట్టపై ఆందోళన చేస్తున్నారు. నిరసనలతో భాగంగా ఇటీవల సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో భూపాల్‌రెడ్డిని కలిసి సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. అడిషనల్కలెక్టర్నిర్వాసితుల వద్దకు వెళ్లి మాట్లాడారు. కలెక్టర్వచ్చి హామీ ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్‌చేశారు. కానీ కలెక్టర్మాత్రం నిర్వాసితుల వద్దకు వెళ్లలేదు. దీంతో ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే బుధవారం బస్వాపురం రిజర్వాయర్ కట్టమీద సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఫోటోలు దిష్టిబొమ్మపై అతికించి దానిని పాడెపై పెట్టి మోశారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. దిష్టిబొమ్మ దహనంలో కొందరు టీఆర్ఎస్లీడర్లు సైతం పాల్గొనడం గమనార్హం.
పేదలకు పట్టాలివ్వకపోతే హైదరాబాద్‌ను ముట్టడిస్తాం
హనుమకొండ/ధర్మసాగర్, వెలుగు: ఎన్నికల సమయంలో కమ్యూనిస్టులు మిత్రులు.. ఇప్పుడు శత్రువులా? మా వాళ్ల జోలికి వస్తే ఊరుకునేది లేదు. గుడిసెవాసులకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వకపోతే హైదరాబాద్‌ను ముట్టడిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. పట్టాల కోసం మరో ఉద్యమం చేస్తామని, ఇండ్ల కోసం చావో.. రేవో తేల్చుకుంటామని తేల్చి చెప్పారు. ప్రభుత్వ భూముల లెక్కలు తీసి వాటిని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జాగాల్లో గుడిసెలు వేసుకున్న పేదలందరికీ పట్టాలు ఇవ్వాలనే డిమాండ్‌తో సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం వరంగల్ కలెక్టరేట్ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో వరంగల్ నగరం చుట్టుపక్కల సర్కారు భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలు పెద్ద సంఖ్యలో ఏకశిల పార్కు వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి కలెక్టరేట్ ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దీంతో వారంతా రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. తరువాత సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, ఇతర నేతలు పేదల గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని వరంగల్ కలెక్టరేట్లో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని, అసలు స్థలమే లేకపోతే పేదలు ఇండ్లు ఎక్కడ కట్టుకుంటారని ప్రశ్నించారు. పెరిగిన ధరల దృష్ట్యా రూ.3 లక్షలు సరిపోవని, రూ.6 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ముందుగా ఇండ్లు లేని నిరుపేదల లెక్కలు తీయాలని డిమాండ్ చేశారు. డబుల్‌బెడ్ రూం ఇండ్లు ఎన్ని కట్టించారో చెప్పాలన్నారు.వరంగల్ జిల్లాలో నాలుగు నెలలుగా ఇండ్ల స్థలాల కోసం పోరాటాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదన్నారు. పట్టాలు తక్షణమే ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా నివాస స్థలాల కొరకు ఆందోళన చేస్తున్న పేద ప్రజలను సంఘటిత పరిచి హైదరాబాద్‌ను ముట్టడిస్తామన్నారు.