లెటర్​ టు ఎడిటర్​..నీటిని రోడ్లపైకి వదలొద్దు

లెటర్​ టు ఎడిటర్​..నీటిని రోడ్లపైకి వదలొద్దు

ప్రతిరోజు ఉదయం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు కాలనీలలో  రోడ్లపై నీరు నదీ ప్రవాహంలా ప్రవహిస్తూ ఉంటున్నది.  విచ్చలవిడిగా నీళ్లను ఇల్లు, వాకిలి, ద్విచక్ర వాహనాలు, కార్లను  శుభ్రం చేయడం వలన ఈ పరిస్థితి ఏర్పడుతున్నది.  పండుగలు పబ్బాల రోజులలో  పరిస్థితి విపరీతంగా ఉంటున్నది.  గత కొన్ని సంవత్సరాలుగా అతివృష్టి వర్షాలకు  హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులు ఇతర రిజర్వాయర్లలో నీరు సమృద్ధిగా ఉండడం వలన నీటిమట్టం పెరిగినదని అందరికీ తెలిసిన విషయమే. 

ఫలితంగా నీటిమట్టం పెరిగి ఇళ్లలోని బోరు బావుల్లో నీరు సమృద్ధిగా ఉంటున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలోని అందరికీ ఉచితంగా నెలకు 20,000 లీటర్ల నీరు సరఫరా పథకం ప్రవేశపెట్టింది. నీరును పొదుపుగా ఉపయోగించుకునే బదులు ఈ పద్ధతిలో  ఉపయోగించడం వలన  వృథా అవ్వడమేకాక,  రోడ్లపై  నడిచేవారికి అత్యంత ఇబ్బందికరంగా ఉంటున్నది.  కొన్ని  సందర్భాలలో   వాహనాల  రాకపోకల వలన పాదచారులపై నీరు పడి ఘర్షణలకు కూడా తావిస్తున్నది. ప్రమాదాలకు దారితీస్తుంది. క్రిములు, కీటకాలు, దోమలు వృద్ధి చెందుటకు దోహదపడుతున్నది.  

అపరిశుభ్ర వాతావరణ నెలకొంటున్నది. సఫాయి ఉద్యోగులు రోడ్లను శుభ్రం చేయుటకు  ఇబ్బందికరంగా ఉంటున్నదని వాపోతున్నారు.  నీరును పొదుపుగా వాడుకోవడం పౌరులుగా మన అవసరం.  నీటి నిల్వలకు తోడ్పడ వలసిన నగర సమాజం ఈ విధంగా చేయడం శోచనీయం. కావున రాజకీయ నాయకులు, మున్సిపల్​ అధికారులు ఈ విషయంలో స్పందించాలి. రోడ్లపై నీటిని వదిలే ఇంటి యజమానులకు, బాధ్యులకు జరిమానా విధించగలిగితే, రోడ్లపై నీటిని వదలడం, నీటిని దుర్వినియోగంచేయడం చాలామేరకు అరికట్టవచ్చు. నగర జీవులు తమ చుట్టుపక్కల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వడం అవసరం. మనం నడిచే రోడ్లలో నీరు వదిలితే, ఇబ్బంది పడేది, అపరిశుభ్రతను ఎదుర్కొనేది మనమే అనే విషయం ప్రతి నగర పౌరుడు గమనించాల్సిన 
అవసరం ఉంది.

- దండంరాజు రాంచందర్ రావు,పాత బోయినపల్లి