రాజకీయ జీవితం నాశనమైనా అబద్ధాలు చెప్పను

రాజకీయ జీవితం నాశనమైనా అబద్ధాలు చెప్పను

రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌లోని గల్వాన్ ఘర్షణలో 20 మంది దేశ సైనికులు చనిపోవడంపై కేంద్ర సర్కార్‌‌ను టార్గెట్‌గా చేసుకొని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. మరోమారు కేంద్రంపై రాహుల్ విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. తన రాజకీయ జీవితం నాశనమైనా సరే.. దేశ భూభాగం గురించి మాత్రం అబద్ధాలు చెప్పనని రాహుల్ స్పష్టం చేశారు. ట్విట్టర్‌‌లో షేర్ చేసిన ఓ వీడియో బార్డర్‌‌ వివాదంపై ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.

‘నా మొత్తం కెరీర్ నాశనమైనా సరే.. ఇండియా భూభాగం గురించి నేను అబద్ధాలు ఆడబోను. చైనీయులు మన భూభాగాన్ని ఆక్రమించారు. నిజాలను దాచిపెట్టి ఆ విషయాన్ని దేశ వ్యతిరేక చర్యగా చూపిస్తున్నారు. ప్రజల దృష్టిలో పడాలని దీనిని దేశభక్తి అని చెబుతున్నారు. ఒకటి మాత్రం సుస్పష్టం.. చైనీయులు మన భూభాగంలోకి వచ్చేశారు. ఇది నన్ను ఇబ్బంది పెడుతోంది. నా రక్తం మరిగేలా చేస్తోంది. ఏ విధంగా మరో దేశం మన భూభాగంలోకి ప్రవేశిస్తుంది? ఓ రాజకీయ నేతలా మీరు నన్ను మౌనంగా ఉండమని, అబద్ధం చెప్పమంటే ఎలా? నేను శాటిలైట్ ఫొటోలను చూసి.. ఆర్మీ వాళ్లతో మాట్లాడా. చైనీయులు దేశంలోకి రాలేదని నేను అబద్ధం చెప్పాలని మీరనుకుంటే.. నేనది చేయలేను. మన దేశంలోకి చైనీయులు అడుగిడలేదని ఎవరైతే అబద్ధాలు చెబుతున్నారో వారు దేశభక్తులు కాదు. మన జాతీయులూ కాదు’ అని రాహుల్ చెప్పారు.