మిర్యాలగూడలో ఒక్కసారిగా ధాన్యం రేటు తగ్గించేసిన మిల్లర్లు

మిర్యాలగూడలో ఒక్కసారిగా ధాన్యం రేటు తగ్గించేసిన మిల్లర్లు

మిర్యాలగూడ, వెలుగు : సన్నొడ్ల కొనుగోళ్లు కాస్త ఊపందుకోవడం, మిల్లులకు ధాన్యం భారీగా తరలివస్తుండడంతో మిల్లర్లు ఒక్కసారిగా రేటు తగ్గించేశారు. మిల్లర్లంతా సిండికేట్‌‌‌‌‌‌‌‌గా మారి వడ్లలో పచ్చ గింజ ఉందంటూ, క్వాలిటీ లేదంటూ కొర్రీలు పెడుతూ ధర ఇవ్వడం లేదు. కొనుగోళ్లు ప్రారంభమైన మొదట్లో క్వింటాల్‌‌‌‌‌‌‌‌కు రూ. 2,200 నుంచి రూ. 2,300 చెల్లించిన మిల్లర్లు ఇప్పుడు రూ. 2 వేలే ఇస్తామంటున్నారు. మంచి రేటు వస్తుందని లోడుతో మిల్లుకు వచ్చిన రైతులు ధరను చూసి ఆందోళన చెందుతున్నారు. వడ్ల లోడుతో మరో మిల్లుకు వెళ్లలేక మిల్లర్‌‌‌‌‌‌‌‌ చెప్పిన రేటుకే అమ్ముకుంటున్నారు. 

మిల్లులకు చేరింది 5 నుంచి 10 శాతమే..

నల్గొండ జిల్లా వ్యాప్తంగా 2022–23 ఖరీ ఫ్‌‌‌‌‌‌‌‌ సీజన్‌‌‌‌‌‌‌‌లో 4.79 లక్షల ఎకరాల్లో వరి సా గైనట్లు అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు తెలిపారు. ఇందులో1.98 లక్షలఎకరాల్లో సన్న రకా లు (చింట్లు, హెచ్‌‌‌‌‌‌‌‌ఎంటీ, పూజలు) సాగు జరుగగా 5లక్షల టన్నుల దిగుబడి, 2.81 లక్షల ఎకరాల్లో దొడ్డు వడ్ల సాగు జరుగగా 7 లక్షల మెట్రిక్‌‌‌‌‌‌‌‌ టన్నుల దిగుబడి వస్తుందని ఆఫీసర్లు అంచనా వేశారు. గత నెలలో కోతలు ప్రారంభం కావడంతో మిర్యాలగూడ పరిధిలోని రైస్‌‌‌‌‌‌‌‌ మిల్లులకు వడ్లు రావడం మొదలైంది. ఇప్పటివరకు 5 నుంచి 10 ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శాతం సన్నొడ్లు మాత్రమే మిల్లులకు తరలివచ్చాయి. అయితే సీజన్‌‌‌‌‌‌‌‌ ప్రారంభంలో ఇచ్చిన రేటు ఇప్పుడు ఇవ్వకపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పూర్తి స్థాయిలో వడ్లు మిల్లులకు చేరితే రేటు ఇంకెంత తగ్గిస్తారోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్వాలిటీగా ఉన్న వడ్లకు మద్దతు ధర చెల్లించాలని కోరుతున్నారు.

సిండికేట్‌‌‌‌‌‌‌‌గా మారిన మిల్లర్లు ?

మిర్యాలగూడ, వేములపల్లి పరిధిలో సుమారు 82 రైస్‌‌‌‌‌‌‌‌ మిల్లులు ఉన్నాయి. సుమారు 10 రోజుల నుంచి మిల్లులకు సన్నొడ్లు వస్తున్నాయి. అయితే మొదట్లో మంచి రేటు ఇచ్చిన మిల్లర్లు ఇప్పుడు సిండికేట్‌‌‌‌‌‌‌‌గా మారి రేటును భారీగా తగ్గించారని రైతులు ఆరోపిస్తున్నారు. సన్నొడ్లను కొన్ని రైస్‌‌‌‌‌‌‌‌ మిల్లుల్లోనే కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సన్న, చిన్న కారు, కౌలు రైతులను దృష్టిలో పెట్టుకుని రైస్‌‌‌‌‌‌‌‌ మిల్లర్లు సహకరించాలని కోరుతున్నారు.

మొదట ఇచ్చిన రేటు ఇప్పుడిస్తలేరు

రెండు ఎకరాల్లో పూజ రకం సన్నొడ్లు సాగు చేసిన. 40 క్వింటాళ్ల దిగుబడి రావడంతో వేములపల్లి మండలం శెట్టిపాలెం వద్ద గల ఓ రైస్‌‌‌‌‌‌‌‌మిల్లుకు తీసుకొచ్చిన. పది రోజుల కింద క్వింటాల్‌‌‌‌‌‌‌‌కు రూ. 2,300 ఇచ్చిన్రని ఇక్కడికి వస్తే ఇప్పుడు రూ. 2 వేలే ఇస్తామంటున్నరు. మరో మిల్లుకు వెళ్లినా ఇదే రేటు ఇస్తున్నారు. పచ్చ గింజ పేరిట రేటు తగ్గిస్తున్నరు.

- చవిటి నాగరాజు, నారాయణపురం, 
మాడ్గులపల్లి మండలం