
- లోక్‌సభ ఎన్నికలకు అందరూ కలిసి పని చేయాలి: మున్షీ
- హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల సెగ్మెంట్లపై రివ్యూ
హైదరాబాద్, వెలుగు : సికింద్రాబాద్, హైదరాబాద్ లోక్‌సభ సెగ్మెంట్లపై కాంగ్రెస్‌పార్టీ దృష్టి సారించింది. ఆ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఫలితాలు దారుణంగా ఉండడంతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నది. ఈ క్రమంలోనే మంగళవారం ఆ రెండు నియోజకవర్గాలతో పాటు చేవెళ్ల సెగ్మెంట్‌పై సమీక్ష చేసింది. ఆయా సెగ్మెంట్ల మైనారిటీ లీడర్లతో ఏఐసీసీ ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు మన్సూర్ అలీ ఖాన్, రోహిత్ చౌదరి, హైదరాబాద్ సెగ్మెంట్ ఇన్చార్జ్, మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్రివ్యూ చేశారు.
గ్రేటర్ పరిధిలోని ముస్లిం ఓటర్లు టార్గెట్‌గా పనిచేయాలని మైనారిటీ నేతలకు సూచించారు. గత ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదని, ఈ సారి అది రిపీట్ కావొద్దని దీపాదాస్ మున్షీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కష్టపడి మంచి ఫలితాలు సాధించాలన్నారు. మూడు పార్లమెంట్ నియోజక వర్గాల పరిధిలో బలాలు, బలహీనతలు అంచనా వేసుకుని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించే విధంగా నాయకులు కృషి చేయాలని సూచించారు.
హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులతో ఇప్పటికే ఓ సమావేశాన్ని నిర్వహించామన్నారు. గ్రూపులు లేకుండా పార్లమెంట్ ఎన్నికల కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు. ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటున్నామని, అర్హులందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్ పార్లమెంట్ కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తానని మున్షీ పర్కొన్నారు.