
న్యూఢిల్లీ: తమిళనాడులో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సౌత్‌లో పట్టు పెంచుకోవాలని.. మరీ ముఖ్యంగా తమిళనాడులో అందని ద్రాక్షగా ఉన్న అధికార పీఠం చేజిక్కించుకోవాలని బీజేపీ ఎప్పటి నుంచో కలలు కంటుంది. ఇందుకోసం ఎన్నికలకు చాలా ముందు నుంచే వ్యూహాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంది కాషాయ పార్టీ. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే కలిసి అధికార డీఎంకే పార్టీని ఢీకొట్టనున్నాయి.
అయితే.. డీఎంకేను మట్టికరిపించడానికి ఏ చిన్న అవకాశం వదులుకోవద్దని బీజేపీ ఆలోచిస్తోంది. ఇందులో భాగంగానే సినీ నటుడు విజయ్ను కూడా కలుపుకుపోవాలని బీజేపీ భావిస్తోందని.. ఇందుకోసం విజయ్ టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కమలం పార్టీ ప్రయత్నిస్తున్నట్లు తమిళనాడు పాలిటిక్స్‌లో ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో విజయ్‌తో బీజేపీ పొత్తుపై క్లారిటీ ఇచ్చారు తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నామలై. సోమవారం (సెప్టెంబర్ 8) ఇండియా టుడే కాన్‌క్లేవ్ సౌత్ ఈవెంట్లో అన్నామలై పాల్గొనగా.. బీజేపీ, విజయ్ టీవీకే పార్టీ పొత్తు గురించి ఆయనకు ప్రశ్న ఎదురైంది.
►ALSO READ | సర్ డ్రైవ్‌లో ఆధార్‌ను పరిగణలోకి తీసుకోవాల్సిందే: ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం
ఈ సందర్భంగా అన్నామలై మాట్లాడుతూ.. బీజేపీ, విజయ్ టీవీకే పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందనే ఊహాగానాలను తోసిపుచ్చారు. విజయ్ టీవీకే పార్టీ, బీజేపీ మధ్య ఎలాంటి పొత్తు ఉండదని కుండబద్దలు కొట్టారు. ఉత్తర భారత పార్టీని వ్యతిరేకిస్తూనే ఉండాలనే నమ్మకం తమిళనాడులో ఇప్పటికీ ఉన్నందున.. విజయ్ బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా చూస్తున్నారని పేర్కొన్నారు. దీంతో టీవీకే పార్టీ ఎన్డీఏలో చేరే అవకాశం లేదని అన్నామలై తేల్చి చెప్పారు.
ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని.. ఒంటరిగా పోటీ చేస్తామని విజయ్ ఇప్పటికే ప్రకటించారు. కానీ బీజేపీ, టీవీకే చివరి నిమిషంలోనైనా చేయి కలుపుతాయని ప్రచారం జరుగుతుండగా.. కమలం పార్టీ కీలక నేత అన్నామలై ఇచ్చిన వివరణతో బీజేపీ, టీవీకే పొత్తు వార్తలకు ఎండ్ కార్డ్ పడింది.