దసరా ముందు ఆర్టీసీ సమ్మె వద్దు: సోమేశ్‌ కుమార్‌

దసరా ముందు ఆర్టీసీ సమ్మె వద్దు: సోమేశ్‌ కుమార్‌

ప్రభుత్వం నియమించిన కమిటీతో ఆర్టీసీ కార్మిక సంఘాలు భేటీ అయ్యాయి. అయితే ఎలాంటి హామీలు ఇవ్వకుండానే చర్చలు ముగిసాయి. దీంతో సమ్మెపై వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు కార్మిక సంఘాలు నేతలు. అయితే దీనిపై స్పందించిన ట్రాన్స్ పోర్టు ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌.. దసరా ముందు సమ్మె చేయవద్దని ఆర్టీసీ జేఏసీకి విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు ముగిసిన తర్వాత మాట్లాడిన ఆయన…ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీస్‌పై చర్చించామన్నారు. ముందుగా తక్షణం పరిష్కారమయ్యే అంశాలపై చర్చించామన్నారు. తర్వాత దీర్ఘకాలిక పరిష్కార మార్గాలపై చర్చించామన్నారు. ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. ఆర్టీసీ జేఏసీ చెప్పిన 26 అంశాలపై చర్చించామన్నారు. కార్మిక సంఘాల డిమాండ్లకు సానుకూలంగా ఉన్నామన్నారు. అవసరమైతే మళ్లీ చర్చలు జరుపుతామన్నారు. కార్మిక డిమాండ్లపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తామని చెప్పారు. ఆర్టీసీ ప్రత్యేక యాక్ట్‌కు కేంద్ర భాగస్వామ్యం అవసరమన్నారు. ఆర్టీసీ సమస్యలను సమూలంగా పరిష్కరించేందుకే యత్నిస్తున్నామన్నారు సోమేశ్‌కుమార్‌.