‘బయో వేస్ట్ ప్రాజెక్టు మాకొద్దు’ : వేలేరు గ్రామస్తుల నిరసన

‘బయో వేస్ట్ ప్రాజెక్టు మాకొద్దు’ : వేలేరు గ్రామస్తుల నిరసన
  • ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా నిరసన 
  •  ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలంలో పొట్టేలు కోసిన పీచర వాసులు 

వేలేరు, వెలుగు: హనుమకొండ జిల్లా వేలేరు మండలంలోని పీచర గ్రామంలో కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్​మెంట్​ ఫెసిలిటీ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే తాము ఇబ్బందులు పడతామని శుక్రవారం గ్రామస్తులు నిరసన తెలిపారు. శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించాల్సి ఉండగా, ప్రాజెక్ట్ ప్రతిపాదిత స్థలంలో మైసమ్మ ఉందంటూ పొట్టేలును కోసి పూజలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఈసందర్భంగా వేలేరు గ్రామస్తులు మాట్లాడుతూ పీచరలో ఏర్పాటు చేయబోయే బయో మెడికల్ వేస్టేజ్​ప్రాజెక్టు వల్ల తాము అనారోగ్యాల బారిన పడతామని ఆందోళన వ్యక్తం చేశారు.

సర్వే నం.537/A1/2లో ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి తెలంగాణ పొల్యూషన్​బోర్డు, స్టేట్ లెవెల్ ఎన్విరాన్​మెంట్​ఇంపాక్ట్​అసెస్మెంట్ అథారిటీ,  పర్యావరణ, అటవీ, వాతావరణ తదితర శాఖల అధికారులు శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణకు రావాల్సి ఉండేదన్నారు. అందుకే వారు రాకుండా నిరసన తెలిపామన్నారు. తామంతా ఐక్యంగా ఉండి బయో మెడికల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు.