ఢిల్లీలో కవిత దీక్ష లిక్కర్ స్కామ్​ డైవర్షన్​కే : వివేక్

ఢిల్లీలో కవిత దీక్ష లిక్కర్ స్కామ్​ డైవర్షన్​కే : వివేక్
  • ఎంపీగా ఉన్నప్పుడు మహిళా రిజర్వేషన్లు గుర్తులేవా
  •     అరెస్ట్​ తప్పదని తెలిసే ఇప్పుడు ఈ ఇష్యూను తెరపైకి తెచ్చారు
  •     చెల్లిని ఈడీ ప్రశ్నించనుందనే అసహనం కేటీఆర్​లో కనిపిస్తోంది
  •     కల్వకుంట్ల కుటుంబాన్ని గద్దె దించేదాక పోరాటం ఆగదని వ్యాఖ్య
  •     సంజయ్, వివేక్  సమక్షంలో బీజేపీలో చేరిన సిరిసిల్ల బీఆర్ఎస్ నేతలు, కేటీఆర్ ముఖ్య అనుచరులు

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్​ కేసులో తన అరెస్టు తప్పదని తెలిసే ఇష్యూను పక్కదారి పట్టించేందుకు సీఎం కేసీఆర్  బిడ్డ, ఎమ్మెల్సీ కవిత మహిళా రిజర్వేషన్ బిల్లు, ఢిల్లీలో దీక్షను తెరపైకి తెచ్చిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి ఆరోపించారు. చాలా మంది బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కేంద్ర సంస్థలు గతంలో విచారించాయని, అప్పుడు స్పందించని మంత్రి కేటీఆర్.. ఇప్పుడు తన చెల్లి దగ్గరకు వచ్చేసరికి మాత్రం తీవ్ర అసహనానికి గురవుతున్నారని మండిపడ్డారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి సమక్షంలో సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు, మంత్రి కేటీఆర్ ముఖ్య అనుచరులు బీజేపీలో చేరారు. బీఆర్ఎస్ సీనియర్ నేత, పీఏసీఎస్  మాజీ చైర్మన్ చక్రధర్ రెడ్డి, సెస్ మాజీ డైరెక్టర్ కొక్కు దేవేందర్ యాదవ్, సర్పంచ్ సంధ్యారాణి సహా పలువురు మాజీ సర్పంచ్​లు, బీఆర్ఎస్ నేతలతోపాటు సుమారు 500 మంది సంజయ్, వివేక్ పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివేక్ మీడియాతో మాట్లాడారు. 

మహిళా బిల్లుపై అప్పుడెందుకు మాట్లాడలేదు

పార్లమెంట్ లో మహిళలకు 33% రిజర్వేషన్ల పేరుతో ఢిల్లీలో దీక్షకు దిగుతున్న కవిత.. ముందుగా తెలంగాణలో ఎక్కడైనా ఈ రిజర్వేషన్లు అమలవుతున్నాయా అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలని వివేక్​ సూచించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరేండ్ల వరకూ ఒక్క మహిళా మంత్రి లేరని, పార్టీ టికెట్ల కేటాయింపులోనూ వారికి సరైన అవకాశాలు ఇవ్వలేదని, మహిళా ఐఏఎస్, ఐపీఎస్ లకు పోస్టింగ్ లు ఇవ్వలేదని, ఈ విషయాలన్నీ కవిత గుర్తుంచుకోవాలన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు కవిత ఏనాడూ పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడలేదన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు 70 ఏండ్లుగా ఉంటున్న విషయాన్ని కేసీఆర్, కేటీఆర్, కవిత గుర్తుంచుకోవాలన్నారు. ఎక్కడ అవినీతి ఉంటుందో అక్కడ దర్యాప్తు సంస్థలు ఉంటాయని, అవినీతి చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. గతంలో తాను కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లినప్పుడు కేంద్ర సంస్థలు నోటీసులు ఇచ్చాయని, వారికి సరైన జవాబుచెప్పడంతో సంతృప్తి చెందాయని గుర్తుచేశారు. విచారణలో నిజాయితీ నిరూపించుకోలేక అడ్డంగా దొరికితే శిక్ష నుంచి ఎవరూ తప్పించుకోలేరని అన్నారు.

అవినీతిపై చర్చకు సిద్ధమా?: రాణిరుద్రమ

దమ్ముంటే సిరిసిల్ల సెస్ లో అవినీతిపై చర్చకు సిద్ధమా అని, సిరిసిల్ల నియోజకవర్గంలో ఇసుక దందాపై చర్చకు రావాలని మంత్రి కేటీఆర్​కు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ సవాల్​ విసిరారు. తెలంగాణకు ఏమీ ఇవ్వడం లేదంటూ ప్రధాని మోడీ, బీజేపీపై కేటీఆర్ చేస్తున్న విమర్శలపై చర్చకు ఎప్పుడైనా.. ఎక్కడైనా రెడీ అని సంజయ్​ ప్రకటిస్తే ఇప్పటి వరకు ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించారు. పదేపదే అబద్ధాలు మాట్లాడుతూ కేటీఆర్​ తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

కేసీఆర్​ ఫ్యామిలీపై వ్యతిరేకత

తన చెల్లి అరెస్టు తప్పదని తెలిసే కేటీఆర్ తీవ్ర అసహనానికి గురవుతున్నారని, గురువారం మీడియా సమావేశంలో ఆయన ఎలా మాట్లాడారో తెలంగాణ ప్రజలంతా చూశారని వివేక్​ చెప్పారు. బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, కేటీఆర్ అంటేనే సిరిసిల్ల ప్రజలకు విరక్తి కలుగుతోందని అన్నారు. అందుకే కేటీఆర్ సొంత నియోజకవర్గమైన సిరిసిల్ల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కేటీఆర్ ముఖ్య అనుచరులు బీజేపీలో చేరారని చెప్పారు. రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారని, తెలంగాణ సంపద మొత్తం కల్వకుంట్ల ఫ్యామిలీ అవినీతికి కరిగిపోయిందన్నారు. తెలంగాణలో అవినీతి, కుటుంబ, నియంత పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా కల్వకుంట్ల ఫ్యామిలీని గద్దె దించేందుకు రెడీగా ఉన్నారని చెప్పారు. కేసీఆర్ నుంచి అధికారం దూరం చేసే దాకా పోరాడుతామన్నారు. ఈ ప్రోగ్రాంలో బీజేపీ రాష్ట్ర నేతలు రాణి రుద్రమ, ప్రకాశ్ రెడ్డి, ఎన్వీ సుభాష్ పాల్గొన్నారు.