
- నేటి నుంచి దోస్త్ స్పాట్ అడ్మిషన్లు
- తొలిసారి అవకాశం ఇచ్చిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు డిగ్రీ కాలేజీల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం తొలిసారిగా దోస్త్ స్పాట్ అడ్మిషన్లకు అవకాశం ఇచ్చింది. శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న దోస్త్ స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ను హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (టీజీసీహెచ్ఈ) చైర్మన్ బాలకిష్టారెడ్డి రిలీజ్ చేశారు. గురువారం ఆయన కౌన్సిల్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. సర్కారుతో పాటు ప్రైవేటు కాలేజీలు, గురుకులాల్లోనూ స్పాట్ అడ్మిషన్లకు అవకాశం ఇస్తున్నట్టు వెల్లడించారు.
స్పాట్ అడ్మిషన్స్ రెండు విడతల్లో నిర్వహిస్తున్నారు. ఈ నెల 15,16 తేదీలో అన్ని కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనుండగా, 17న దోస్త్ పోర్టల్లో అడ్మిషన్ల వివరాలను అప్లోడ్ చేయనున్నారు. అయినా సీట్లు మిగిలితే..రెండో విడతలో స్పెషల్ స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించనున్నారు. ఈ నెల18,19 తేదీల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఈ ఫేజ్లో లోకల్ వాళ్లు లేకపోతే నాన్ లోకల్ స్టూడెంట్లకు అవకాశం ఇస్తారు.
20న అడ్మిషన్ల వివరాలను పోర్టల్లో అప్లోడ్ చేయనున్నారు. ఈ కేటగిరీలో చేరిన వారికి ఫీజు రీయింబర్స్ మెంట్ వర్తించదని అధికారులు వెల్లడించారు. కాగా, 830 డిగ్రీ కాలేజీల్లో 2,08,895 సీట్లు, 79 గురుకులాల్లో 12,357 సీట్లు ఖాళీగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
ఏఏ కాలేజీలో ఎన్ని ఖాళీ సీట్లు!
కాలేజీ సీట్లు
కోఠి ఉమెన్స్ యూనివర్సిటీ 263
బేగంపేట ఉమెన్స్ కాలేజీ 267
నిజాం కాలేజీ 205
వర్సిటీ సైన్స్ కాలేజీ, సైఫాబాద్ 265
సిటీ కాలేజీ 261
ఇందిరాప్రియదర్శిని ఉమెన్స్ కాలేజీ 486
వివేకానంద డిగ్రీ కాలేజీ,విద్యానగర్ 236
డిగ్రీ కాలేజీ, ఖైరతాబాద్ 225