మల్కాజిగిరి, వెలుగు: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేసింది. బుధవారం నేరేడ్మెంట్లోని పోలీస్ కమిషనరేట్లో జరిగిన కార్యక్రమంలో 194 మంది బాధితులకు ఇండ్ల మంజూరి పత్రాలను మంత్రి అడ్డూరి లక్ష్మణ్ అందజేశారు. కేవలం ఇండ్లే కాకుండా, బాధితులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి రుణాలు, సబ్సిడీలు అందించాలని కలెక్టర్లను ఆదేశించారు.
2014 నుంచి 2025 మధ్య నమోదైన కేసుల్లో అత్యంత దుర్భర స్థితిలో ఉన్న బాధితులను గుర్తించి ఈ ఇండ్లను కేటాయించినట్లు తెలిపారు. అలాగే, దళిత, గిరిజన విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మల్కాజిగిరి సీపీ అవినాష్ మహంతి, కలెక్టర్ మనోజ్ చౌదరి, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల గద్దర్ తదితరులు పాల్గొన్నారు.
