లోన్ వస్తేనే డబుల్​ బెడ్రూం ఇండ్ల స్కీం ముందుకు

లోన్ వస్తేనే డబుల్​ బెడ్రూం ఇండ్ల స్కీం ముందుకు
  • హడ్కో లోన్ కష్టమే!
  • రూ.2 వేల కోట్ల కోసం రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ప్రయత్నాలు
  • కనీసం వెయ్యి కోట్లు అయినా ఇవ్వాలని వినతి
  • ఫండ్స్ దారిమళ్లిస్తున్నట్లు ఫిర్యాదులతో హడ్కో వెనుకడుగు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్​కు హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ) నుంచి అప్పు పుట్టే అవకాశాలు కనిపించడం లేదు. రూ. 2 వేల కోట్ల లోన్ కోసం హౌసింగ్ డిపార్ట్ మెంట్ అధికారులు కొంతకాలంగా హడ్కో అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ అంశంపై హౌసింగ్ స్పెషల్ సీఎస్ సునీల్​శర్మ  ఢిల్లీ వెళ్లి హడ్కో అధికారులను కలిశారు. ఈ భేటీ జరిగి నెల అవుతున్నా ఇంత వరకు లోన్ పై ఎలాంటి సమాచారం లేదని ఇక్కడి అధికారులు చెప్తున్నారు. కనీసం రూ. వెయ్యి కోట్లు అయినా ఇవ్వాలని హడ్కోను కోరుతున్నారు.  

అప్పులు ఎక్కువగా ఉండటంతో..


ఇటీవల కాగ్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం.. తెలంగాణకు 4.13 శాతం నికర అప్పులు ఉన్నాయి. ఏపీతో పోలిస్తే తెలంగాణకు అప్పులు ఎక్కువ ఉన్నట్లు కాగ్ రిపోర్ట్ వెల్లడించింది. మరో వైపు రాష్ట్రంలో కార్పొరేషన్ల పేరుతో వేల కోట్ల రూపాయల లోన్లను రాష్ట్ర ప్రభుత్వం ష్యూరిటీగా ఉండి తీసుకుంది. ప్రభుత్వం ష్యూరిటీగా ఉంటే సరిపోదని, ఆ అప్పులను కార్పొరేషన్లు ఎలా తీరుస్తాయో వివరణ ఇవ్వాలని రాష్ట్ర సర్కార్​ను ఇటీవల ఆర్బీఐ కోరింది. ఇక లోన్లు ఇస్తే ఒక స్కీమ్​ కోసం తీసుకొని వాటిని ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటున్నారనే  ఫిర్యాదులు వస్తున్నాయని హడ్కో అధికారులు చెప్పినట్లు హౌసింగ్ ఆఫీసర్లు అంటున్నారు. ఇప్పటికే తీసుకున్న అప్పులకు సంబంధించి ప్రతి 3 నెలలకు ఒకసారి అసలు, వడ్డీని హడ్కోకు బడ్జెట్ లో కేటాయించిన నిధులతో రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్నది. ట్రాక్ రికార్డ్ బాగానే ఉన్నప్పటికీ ప్రభుత్వానికి వచ్చే లోన్లు ఆగిపోవటంతో కార్పొరేషన్​కు కూడా లోన్లు ఇచ్చేందుకు హడ్కో వెనుకడుగు వేస్తున్నది. 


లోన్ వస్తేనే డబుల్​ బెడ్రూం ఇండ్ల స్కీం ముందుకు


హడ్కో లోన్ వస్తేనే డబుల్ బెడ్రూం ఇండ్ల స్కీమ్​ ముందుకు వెళ్తుందని రాష్ట్ర అధికారులు అంటున్నారు. ఈ స్కీమ్​కు సంబంధించి కాంట్రాక్టర్లకు రూ. 800 కోట్ల బిల్లులు పెండింగ్​లో ఉన్నాయి. లోన్ వస్తే వీటిని క్లీయర్ చేసి మిగతా నిధులతో రన్నింగ్ ఇండ్ల నిర్మాణం చేసేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు.