- ఒక్క పరీక్షతో గురుకులాలు, కేజీబీవీల్లో అడ్మిషన్
- స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్
హైదరాబాద్, వెలుగు: టీజీఆర్జేసీ సెట్ రాసే విద్యార్థినులకు అడ్మిషన్లలో రెండు ఆప్షన్లు కల్పించాలని సర్కారు నిర్ణయించింది. దీనివల్ల ఒక్క ఎంట్రన్స్ టెస్ట్రాస్తే.. మెరిట్ ఆధారంగా అటు టీజీఆర్జేసీ గురుకులాల్లో, ఇటు కొత్తగా ఏర్పాటైన యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కేజీబీవీల్లో సీటు పొందే అవకాశం దక్కింది. శనివారం వెలుగు దినపత్రికలో ‘ఒకే రోజు రెండు ఎంట్రెన్స్లా?’ అనే హెడ్డింగ్ తో ప్రచురితమైన కథనంపై విద్యాశాఖ స్పందించింది.
స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ టీజీఆర్జేసీ సెట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏదైనా ఒక పరీక్ష రాస్తే చాలు, వచ్చిన మెరిట్ ఆధారంగా ఈ రెండు రకాల కాలేజీల్లో సీటు పొందే చాన్స్ ఉంటుందని ప్రకటించారు.
ఇంటర్‌తోపాటు పోటీ పరీక్షలకు కోచింగ్
రాష్ట్రంలోని 93 కేజీబీవీలను ప్రభుత్వం యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ గా మార్చింది. ఈ సంస్థల్లో అడ్మిషన్ పొందిన వారికి రెగ్యులర్ ఇంటర్‌తోపాటు ఐఐటీ-, జేఈఈ, నీట్, ఈఏపీ సెట్, క్లాట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్ఇవ్వనున్నారు. గ్రామీణ విద్యార్థినులకు కార్పొరేట్ స్థాయి విద్యనందించడమే ఈ నిర్ణయం వెనకున్న ఉద్దేశమని డైరెక్టర్ తెలిపారు.
నేడు టీజీఆర్జేసీ సెట్
తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీలు, ఎక్సలెన్స్ కేజీబీవీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీఆర్జేసీ సెట్ ఆదివారం జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్న ఈ పరీక్ష కోసం 317 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 35 గురుకులాలు, 93 కేజీబీవీల్లో ప్రవేశాల కోసం మొత్తం 76,174 మంది విద్యార్థినులు దరఖాస్తు చేసుకున్నారు. ఎగ్జామ్‌లో వచ్చే మెరిట్ ఆధారంగా ఆయా కాలేజీల్లో సీట్లను కేటాయించనున్నట్లు గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రమణకుమార్ తెలిపారు.
స్టూడెంట్స్ పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని, మొబైల్ ఫోన్లు, డిజిటల్ వాచీలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని అధికారులు పేర్కొన్నారు. టీజీఆర్జేసీ, కేజీబీవీ రెండింటికీ దరఖాస్తు చేసుకున్న వారు తమకు నచ్చిన గ్రూప్హాల్ టికెట్‌తో పరీక్షకు హాజరుకావొచ్చని, ఫలితాల వెల్లడి సమయంలో బాలికలకు రెండు సంస్థల్లోనూ ప్రవేశానికి అవకాశం కల్పిస్తామని తెలిపారు.
