భారీ సైజు ఆలుగడ్డ.. ఎన్ని కేజీలుందో తెలుసా..

భారీ సైజు ఆలుగడ్డ.. ఎన్ని కేజీలుందో తెలుసా..

కూరగాయలకు పోయినప్పుడు కేజీ ఆలుగడ్డలు మోసేందుకే తంటాలు పడతం.  అలాంటిది ఒక్కో ఆలుగడ్డ 8 కేజీలు ఉంటే.. వామ్మో! ‘మా కొద్దులే’ అని అక్కడే పడేసి వస్తరేమో. అయితే, ఈ ఆలుగడ్డను చూస్తే కూడా అట్లనే ఆశ్చర్యపోతరు. ఎందుకంటే న్యూజిలాండ్‌‌‌‌లో ఒక పొలంలో 8 కేజీల ఆలుగడ్డ కాసింది. హామిల్టన్‌‌‌‌కు చెందిన కొలిన్‌‌‌‌, బ్రౌన్‌‌‌‌ అనే రైతులు వాళ్ల పొలంలో ఆలుగడ్డ, దోసకాయ పంటను సాగు చేస్తున్నారు. ఆలుగడ్డ పంట చేతికి రావడంతో వాటిని భూమి నుంచి పెకిలించడం మొదలుపెట్టారు. అలా చేస్తూ చేస్తూ ఒక దగ్గరకు వచ్చి ఆలుగడ్డను పెరుకుతుంటే  ఎంతసేపటికి పైకి రాదే! . “ ముందు ఏదైనా రాయి అడ్డం పడిందేమో అనుకున్నాం. కొద్దిగా గుంతలా తవ్వి చేయి పెట్టి చూస్తే రాయి కాదని అర్థమైంది. మరేంటి ఇది అని కష్టపడి పైకి తీశాం. అప్పుడు అర్థమైంది అది ఆలుగడ్డ అని. దానికి మేం ‘డోగ్‌‌‌‌’ అని పేరు పెట్టుకున్నాం. ఫొటోలు తీసి గిన్నిస్‌‌‌‌ బుక్‌‌‌‌ వాళ్లకు కూడా పంపాం. 2011లో బ్రిటన్‌‌‌‌లో ఐదు కేజీల ఆలుగడ్డ గిన్నిస్‌‌‌‌ బుక్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ రికార్డ్స్‌‌‌‌కు ఎక్కింది. ఇప్పుడు మా డోగ్‌‌‌‌ ఆ రికార్డును బద్దలు కొడుతుంది” అని ఆనందంగా చెప్పారు ఆ రైతులు.