
తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచి జిల్లా కరుణాపురంలో కల్తీసారా పదుల సంఖ్యలో వ్యక్తుల్ని బలితీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం (జూన్ 26) నాటికి కల్తీ మద్యం సేవించి మరణించిన వారి సంఖ్య 61కి పెరిగింది. సుమారు 118 మంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కల్తీ మద్యం ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్పందించింది. తమిళనాడు చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్‌కు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై వివరణాత్మక నివేదిక కోరింది. అదే కల్తీ సారాతో ఆరుగురు మహిళలు కూడా మరణించడంతో జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. సుమోటోగా తీసుకుని విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలోని సభ్యురాలైన ఖుష్బు సుందర్ ఈరోజు బాధిత కుటుంబాలతోపాటు చికిత్స పొందుతున్న వారిని కూడా పరామర్శించనున్నారు.