మనుషులతో మాట్లాడే ఒక సాధారణ మనిషే కవి “A man speaking to men” విలియం వర్డ్స్ వర్త్ సాధారణ మనిషిలా కంటే కవికి ఎక్కువ గ్రహణ శక్తి, ఊహాశక్తి, మానవ స్వభావాన్ని గ్రహించే గుణం ఉంటుంది. ఈ కవి తన సొంత భావాలనే కాకుండా ఇతరుల బాధను, సంతోషాలను తనవిగా భావించి కవిత్వం రాస్తాడు. ఈ మాటలు అచ్చు గుద్దినట్టుగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డికి సరిపోతాయి. ఆయన కవిత్వం కలం నుంచి ఉద్భవించలేదు. అనుభవం నేర్పిన గాయం నుంచి పుట్టుకొచ్చిన అక్షర స్వరూపం. ప్రజాస్వామ్య పాదాలకంటిన పంకిలాన్ని శుద్ధి చేసే పనిని స్వీకరిస్తూ ‘ఏడు కోలల బాయి’ని తవ్వి ఏడు యుగాల దాకా మరువని నిధిగా సీస పద్య కవిత్వంలో రూపు కట్టాడు.
జార్జ్ ఆర్వెల్ literary Critics ప్రకారం ఏ రచన కూడా పూర్తిగా రాజకీయాలకు అతీతం కాదు. ఆయన తన ప్రసిద్ధ వ్యాసం ‘‘Why I Write’’ (నేను ఎందుకు రాస్తాను)లో ఇలా పేర్కొన్నారు. ‘‘ఏ పుస్తకమూ రాజకీయ పక్షపాతం లేకుండా ఉండలేదు. కళకి రాజకీయాలతో సంబంధం ఉండకూడదు అనే అభిప్రాయమే ఒక రాజకీయ వైఖరి.” ఆయన విమర్శ అంతా రచయితలు తమ కాలపు రాజకీయ వాస్తవాల పట్ల ఎంతవరకు నిజాయితీగా ఉన్నారు? అనే కోణం నుంచే సాగింది. ఇక్కడ ఈ విషయం ప్రస్తావన గురించి మాట్లాడితే ఆర్వెల్ ఆలోచనలలోని నిజాయితీ నరసింహారెడ్డి ఏడు కోలల బాయిలో చూడొచ్చు.
నరసింహ రెడ్డి నిజాయితీగా నాయకులకు, అధికారులకు లొంగకుండా, ప్రచారాలకు బలికాకుండా, సమాజ శ్రేయస్సు కోసం కంటికి కనిపించే వాస్తవాన్ని చాలా సరళంగా, స్పష్టంగా, ఎటువంటి హంగూ, ఆర్భాటాలు లేకుండా సూటిగా ఏడు కోలల బాయిని రూపొందించారు. ఈ శతకంలో ప్రధాన వస్తువు ప్రజాస్వామ్యం దాని మనుగడ, ఎన్నికల చరిత్ర, తెలంగాణ – ఆంధ్ర పదాల యాస, కవి అంతరంగ విశ్లేషణలు, సామాజిక మార్పును కోరుతూ పిలుపుగా సాగే రచన. పద్య రచన శైలిలో సరళ గంభీరత కనిపిస్తుంది. చెప్పదలుచుకున్న విషయాన్ని వ్యంగ్యాస్త్రంగా తీసుకుని, సీస పద్య ఉద్దేశాన్ని కూడా కవి నేర్పుతో ఉపయోగించి విజయం సాధించాడు.
“బుర్దమట్టల టేస్టు అర్థమౌ కొందరికి
కొరమట్టలే బెస్ట్ కొందరికిని....
ధనము లేకుండా పాలిటిక్స్ దండగనెడు”
ఈ పద్యంలో మందు సుక్క సరదా కవిత్వంలా పైకి కనిపించినా నిశితంగా రాజకీయ సామాజిక అంతరార్థం దాగి ఉంది. భోజనం గురించే కాకుండా మనుషుల భిన్నత్వాన్ని వివరించడానికి ప్రతీకగా ఈ పద్యంలో కవి నేర్పును వహిస్తాడు. తెలంగాణ గ్రామీణ యాసను, లోతైన సామాజిక వ్యంగ్యాన్ని పాఠకుడు గ్రహించొచ్చు.
“మూల్గి మంచమునున్న ముసలాయనను జేరి ఒగలైన కన్నీళ్లు ఒలకబోయు” లీడర్ల చిత్ర విచిత్ర వేషాలను అక్షరబద్ధం చేసి, హవ్వ! అనిపించేలా వాళ్ల పనులను దండకట్టి చూపెడతాడు.
“రాజకీయాలు అంటేనే రచ్చలాగే/ఒక్కడన్నను తేలునా సొక్కపోడు!” నికార్సైన రాజకీయ నేతలు ప్రజాస్వామ్యంలో కరువయ్యారంటూ వెంకన్నను సామాన్య ఓటర్గా భావించి, ఒర్రుబోతుగాన్ని తిడుతున్నట్లుగా ఉన్నా, అందులో ఓ స్నేహితుడి ఆవేదన, సమాజం బాగుపడాలనే తపన కనిపిస్తాయి.ఇందులో ప్రజాస్వామ్య సిద్ధాంతానికి తిలోదకాలు వదిలిన ఆనవాళ్లు కోకొల్లలు. అట్టి విషయాలపై నరసింహారెడ్డి పద్యాన్ని ఆయుధంగా తీసుకుని వక్రమార్గంలో అధికార పీఠంపై కూర్చున్న గద్దల రెక్కలను తెగ నరకాలని సామాన్య పరిభాషలో పద్య సొగసును అద్దుతాడు. ఎన్నికల ప్రహసనంలో ఓటరు బాధ్యత గుర్తించాలని బాకా ఊది మరీ చైతన్య శీర్షికగా శిల్ప సౌందర్యాన్ని చూపెడుతూనే, తన గుండెలో రగిలే అగ్నిపర్వతం పదవిస్పోటనం చెంది ఏడు కోలల బాయిగా పరిమళాలను వీచింది.ప్రలోభాల మత్తులో పడ్డ ఓటరు క్వార్టర్ దేవున్ని నమ్మి ఐదు సంవత్సరాలు ఎలా మోసపోతాడో కొంత పాడుతూనే, రాజకీయ రక్కసులకు తోడు దొంగలైన కొన్ని రకాల పత్రికలపై విమర్శకస్త్రాలు ఎక్కు పెడతాడు.
“పార్టీకో పేపరు పనిగట్టుకుని నడిపి
లేనిది ఉన్నట్టు లెక్క రాసి
బలిసినోడికి రెండు బాకాల ఎడిషన్లు....
పత్రికలనెల్ల చరబట్టి పాడు చేసి”
ఫోర్త్ ఎస్టేట్ పై పోరాటానికి తెరతీస్తాడు. ‘రూల్స్ గీల్సూ అంటు ఫాల్స్ మాటలు చెప్తే తుప్పలు తంగేళ్లు తప్పవువ్రా’ నిజాయితీపరులైన అధికారులు వాళ్ల నిజాయితీని రాజకీయ తక్కెడలో ఇలా తాకట్టు పెట్టుకుంటారో ఒక అధికారిగా స్వీయ అనుభవంతో చెప్పినట్టు చెప్పి, వాళ్ల గుండెలోని దీనావస్థ వైపు తన కవిత్వం కన్నెర్ర చేపిస్తాడు.
ఎన్నికల ఖర్చు విషయంలో ‘‘ఎన్నికల్ అంటేనె ఏడు కోలలబాయి తరగదు దిగుతుంటే దస్కుభూమి’’ ఎన్నికలు అంటే అథఃపాతాళానికి పోయే లోతైన బావి లాంటివి. ఎంత డబ్బు గుమ్మరించినా, ఎంత ఆస్తిని కరిగించినా (దస్కుభూమి) చాలదు, తరిగిపోతూనే ఉంటుంది. వెన్నుపోటు రాజకీయాలు ముఖం మీద తీయగా మాట్లాడుతుంటారు, కానీ వెనుక నుంచి రక్తం చిందించకుండానే, పదునైన బాకులతో పొడిచి, రాజకీయంగా ఒకరి రూపుమాపేయడానికి వెనకాడరు. అవకాశవాద రాజకీయ జూదంలో నిన్నటివరకు తిట్టుకున్న ‘‘చిరకాల శత్రువు’’ కూడా కేవలం అధికారం, డబ్బు సంపాదన అనే ఒకే ఒక్క లక్ష్యంతో రాత్రికి రాత్రే విచిత్రంగా ‘‘మిత్రుడు’’ అయిపోతాడనీ సూటైన వాక్యాన్ని శక్తివంతంగా ప్రతిబింబించాడు.
ఏనుగు నరసింహారెడ్డి శతక రచన పోకడ చూస్తే పద్యం రాయరాని వారు కూడా అభ్యసన ప్రక్రియగా రాసే ప్రయత్నం చేస్తారనడంలో సందేహం లేదు. సరళ భావ ప్రకటనలో సంక్లిష్టమైన సాహితీ చర్చకు పునాదులు వేశారు. ఇది ఆయన అనుభవసారంలో ఉప్పొంగిన అణుబాంబు ప్రయోగం. తనలోని సూటి ప్రశ్న సుందర స్వప్నంగా సాకారం కావాలని, ఓటరుగా ఉన్న మనిషి చైతన్యపరుడై సామాజిక బాధ్యతను నెరవేర్చాలని పద్యాల్లో ఉద్ఘాటించారు.
తను కలగనే సమాజం కోసం తనే చైతన్య దివిటీ ఎత్తిపట్టాడు. రాజకీయ రణరంగంలో భీతిల్లే పౌరునికి అండగా తానే దట్టి కడతాడు. రాజకీయ శంకు చక్రాల మధ్య నలిగే నేటితరం యువతకు మార్గశీర్షంగా స్నేహ బాహుటాను ఎగరేసి కర్తవ్య బోధనకు నిష్టగా మారుతాడు. యుగయుగాల చరిత్రను చక్కదిద్దుటకు ఏడు కోలల బాయిని తవ్వి ఎండిన ముఖాలను కడిగే ప్రయత్నాన్ని అభినందిస్తూ, చరిత్ర దర్పణంగా నిలబడ్డ ఈ కావ్య గానం సఫలీకృతం కావాలని ఆశిస్తూ పెద్దలు నరసింహారెడ్డి గారికి అభినందనలు.
- గన్నోజు ప్రసాద్
