పబ్లిక్​ సెక్టార్ యూనిట్లను కేంద్ర ప్రభుత్వమే కాపాడుతోంది: మహేంద్ర నాథ్​ పాండే

పబ్లిక్​ సెక్టార్ యూనిట్లను కేంద్ర ప్రభుత్వమే కాపాడుతోంది: మహేంద్ర నాథ్​ పాండే

రామచంద్రాపురం, వెలుగు:  దేశంలోని పబ్లిక్​ సెక్టార్ యూనిట్లను కేంద్ర ప్రభుత్వమే కాపాడుతోందని, కొంతమంది ప్రతిపక్షాల నేతలు ప్రభుత్వ సంస్థలపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్​మహేంద్ర నాథ్​ పాండే అన్నారు. రాహుల్​ గాంధీ జోడో యాత్రలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నామంటూ బురద జల్లుతున్నాడని ఆరోపించారు. పబ్లిక్​ సెక్టార్​ యూనిట్ల పరిశీలనలో భాగంగా గురువారం ఆయన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని బీహెచ్​ఈఎల్​ను విజిట్​చేశారు. జీరో వన్ ​బ్లాక్​, న్యూ బ్లేడ్​షాప్​లో పర్యటించి అక్కడి అధికారులతో సమావేశమయ్యారు.

బీహెచ్ఈఎల్​ఉత్పత్తులు, చేపట్టబోయే ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్​ భారత్​లో భాగంగా తీసుకున్న నిర్ణయాల వల్లే నేడు స్వదేశంలోనే అన్ని రకాల ఉత్పత్తులు తయారు చేసుకోగలుగుతున్నామన్నారు. బీహెచ్ఈఎల్​ను ప్రైవేటుపరం చేసే ప్రసక్తే లేదని, ఇప్పటి వరకు థర్మల్ ​వ్యవస్థకే పరిమితమైన బెల్..​హైడ్రోజన్ ​గ్యాస్​, డిఫెన్స్​సెక్టార్​లోకి కూడా ప్రవేశించి లాభాల్లో ఉందన్నారు. భారీ పరిశ్రమల శాఖ జాయింట్ సెక్రెటరీ విజయ్​ మిట్టల్​, బీహెచ్​ఈఎల్ సీఎండీ నలిన్​ సింఘాల్, డైరెక్టర్​ రేణుక గెర,​ ఈడీ వరదరాజన్​ 
పాల్గొన్నారు.