ఒకరితో స్నేహం చేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. వారి వలన మనకు మేలు చేకూరకపోయినా కీడు జరగకుండా చూసుకోవాలని పంచతంత్రం చెబుతోంది. పంచతంత్రంలో కరటకదమనకులనే రెండు నక్కలు ఉంటాయి. ఒకరోజు కరటకుడు దమనకునితో, ‘దమనకా! మనం పింగళక మహారాజు దగ్గర ప్రధానులం కాదు కదా. మనకు అనవసర విషయాలు ఎందుకు?' అంది.అందుకు దమనకుడు, ‘ప్రధానులం కావటానికి ఎంతో సేపు పట్టదు.
రాజు చేత ఆదరింపబడితే ప్రజ్ఞ మిక్కిలి ప్రకాశిస్తుంది. రాజు దగ్గర ఉండటం వలన తంత్రం నడపగల సమర్థత వస్తుంది. ఆ సామర్థ్యం వల్ల ప్రధాని పదవి లభిస్తుంది. ఎంతటి ప్రజ్ఞావంతుడైనప్పటికీ రాజు ఆదరణ లేకపోతే, ‘పెట్టెలో ఉండే రత్నం’ లాగ ప్రకాశించడు.
మనిషి సాధువర్తనుడైనప్పుడు సర్వలోక పూజ్యుడు అవుతాడు. లేదంటే అధముడవుతాడు. మానావమానాలు మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటాయి. గుణవంతుడు అని పేరు తెచ్చుకోవటం చాలా కష్టం. దుర్గుణుడు అను పేరు తెచ్చుకోవటం చాలా సులభం. పెద్ద కొండరాయిని కొండ పై భాగానికి ఎక్కించటం కష్టం. కాని కిందకు తోసేయటం చాలా సులువు. ఇందుకు ఉదాహరణగా నీకు మంచి కథ చెబుతాను విను’ అని కథ ప్రారంభించాడు.
‘ఒక రాజ్యంలో మందవిసర్పిణి అని ఒక పెద్ద పేను ఉంది. అది అదను చూసుకుని రాజుగారి మంచం మీద చేరి, చాలా జాగ్రత్తగా జీవిస్తోంది. అలా ఉండగా ఒకనాడు డిండిమం అనే ఒక నల్లి మందవిసర్పిణి నివసిస్తున్న మంచం దగ్గరకు వచ్చింది. అప్పుడు ఆ పేను ఎదురు వెళ్లి నల్లిని గౌరవంగా ఆదరించి, అతిథి మర్యాదలు చేసి, కుశల ప్రశ్నలు వేసి, ‘ఇక్కడకు ఏ పని మీద వచ్చావు’ అని అడిగింది.
అందుకు సమాధానంగా నల్లి, ‘పేను బావా! అత్యంత మిత్రుడవైన నిన్ను ఒక సహాయం కోరి వచ్చాను. నీ అనుగ్రహం ఉంటే నా కోరిక నెరవేరుతుంది’ అంది. ఆ మాటలు విన్న పేను ‘నువ్వు నాకు ప్రాణసమానుడివి. నీ కోరిక ఏమిటో చెప్పు, నెరవేరుస్తాను’ అంది. అందుకు నల్లి, ‘నేను మనుషుల శరీరాల మీద ఆధారపడి, వారి రక్తం తాగుతూ జీవిస్తుంటానని నీకు తెలుసు. అయితే ఇంతవరకు రాజుల రక్తం తాగలేదు.
రుచికరమైన వంటకాలు, నేతి పిండివంటలు, రకరకాల ఫలరసాలు, రుచికరమైన ఎన్నో పదార్థాలు, పండ్లు, వివిధ రకాల మాంసాలు, ఆవు పాలు, మద్యం, గడ్డ పెరుగు... వంటి శ్రేష్టమైన పదార్థాలను ఆహారంగా భుజిస్తూ, ఎండకన్ను ఎరుగని రాజుల రక్తం చాలా రుచిగా ఉంటుందని విన్నాను. అంతటి రుచికరమైన రక్తాన్ని నేను ఇంతవరకు రుచి చూడలేదు. రాజు గారు నిద్రించే ఈ మెత్తటిపరుపు మీద నాకు కొద్దిగా చోటిస్తే, నా కోరిక నెరవేరుతుంది’ అంది. అందుకు ఆ పేను ’అలాగే. అయితే నువ్వు తొందరపడకుండా, అదను చూసి, రాజు మైమరచి నిద్రిస్తున్న సమయంలో ఆయన శరీరం నుంచి నీకు కావలసినంత రక్తం పీల్చుకుని, జాగ్రత్తగా తప్పించుకో’ అని పలికింది. అందుకు నల్లి సంతోషంతో, ‘నువ్వు చెప్పినట్లే నడుచుకుంటాను’ అని పలికి, పేనుతో స్నేహంగా మెలుగుతూ, ఆ పర్యంకం మీదే నివసిస్తోంది.
ఒకనాడు రాజు ఆదమరచి నిద్రిస్తున్న సమయంలో రాజు శరీరం నుండి రక్తం పీల్చటం ప్రారంభించింది. దానితో రాజుకి నిద్రా భంగం కలిగి చికాకు పడుతూ, తనకు కాళ్లు ఒత్తే పరిచారకుడి వైపు తిరిగి, ‘తేలు కుట్టినట్లుగా ఉంది, దీపం తీసుకువచ్చి చూడు’ అన్నాడు. దీపం తీసుకువచ్చేలోగా నల్లి దూరంగా పారిపోయింది. పేను మాత్రమే అక్కడే ఉండిపోయింది.
పరిచారకుడు దీపం తీసుకువచ్చి, రాజు గారి మంచానికి నాలుగు మూలలా వెతికాడు. మంచానికి ఒక పక్కన కరచి పట్టుకున్న పేనును చూచి, ‘ఇదే రాజుగారిని కుట్టి ఉంటుంది’ అని భావించి, దాని స్వభావం గురించి కూడా ఆలోచించకుండా.. ఆ పేనును చంపేశాడు. తనకు ఆశ్రయం ఇచ్చినందుకు కనీస కృతజ్ఞత కూడా లేని ఆ నల్లి హాయిగా తప్పించుకుంది. అందువల్ల అవతలి వారి స్వభావం తెలుసుకోకుండా వారితో స్నేహం చేయరాదు’ అని చెప్పాడు.అందుకే స్నేహం చేయడానికి ముందే వారి గుణగణాలు తెలుసుకోవాలని పంచతంత్రం చెబుతోంది.
- డా. పురాణపండ వైజయంతి-
