స్టార్టప్ అంటే ఇలా ఉండాలి గురూ.. నెలకు 4 కోట్ల టర్నోవర్.. ఈమె బిజినెస్ ఐడియా అదుర్స్ !

స్టార్టప్ అంటే ఇలా ఉండాలి గురూ.. నెలకు 4 కోట్ల టర్నోవర్.. ఈమె బిజినెస్ ఐడియా అదుర్స్ !

పర్యావరణానికి హాని చేసే వేస్ట్‌‌‌‌‌‌‌‌ నుంచి మనకు పనికొచ్చే వస్తువులు తయారుచేయడం కామన్‌‌‌‌‌‌‌‌. కానీ.. నేలకు మేలు చేసే ఎరువులు తయారుచేస్తోంది డాక్టర్ సాహు. తాతల నాటి నుంచి చేస్తున్న సేంద్రియ సాగుకు బదులు రైతులు విపరీతంగా కెమికల్స్‌‌‌‌‌‌‌‌ వాడడం గమనించింది సాహు. మరోవైపు ఊరి చివరన పేరుకుపోతున్న స్టీల్‌‌‌‌‌‌‌‌ స్లాగ్‌‌‌‌‌‌‌‌ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలి అనుకుంది. ‘ఒకే దెబ్బకు రెండు పిట్టలు’ అన్నట్టు ఈ రెండింటికీ ఒకే ఇన్నొవేషన్‌‌‌‌‌‌‌‌తో పరిష్కార మార్గాన్ని కనిపెట్టింది. రూర్కెలాలో పేరుకుపోతున్న పారిశ్రామిక వ్యర్థాలను బయో -ఎరువులుగా మారుస్తూ.. అటు పర్యావరణానికి, ఇటు రైతులకు మేలు చేస్తోంది. 

దేశంలోని ప్రముఖ పారిశ్రామిక కేంద్రమైన రూర్కెలా పట్టణ శివార్లలో కొన్నేండ్ల నుంచి ఇండస్ట్రియల్‌‌‌‌‌‌‌‌ వేస్ట్‌‌‌‌‌‌‌‌ పేరుకుపోతోంది. ముఖ్యంగా అక్కడ ఉక్కు కర్మాగారాల నుంచి భారీ మొత్తంలో లింజ్–డోనావిట్జ్ (ఎల్‌‌‌‌‌‌‌‌డీ) స్టీల్‌‌‌‌‌‌‌‌ స్లాగ్‌‌‌‌‌‌‌‌ విడుదల అవుతుంది. ఇది స్టీల్‌‌‌‌‌‌‌‌ తయారు చేసే ప్రక్రియలో వెలువడే ఒక వ్యర్థ పదార్థం. రూర్కెలాలో ఈ స్లాగ్‌‌‌‌‌‌‌‌ కుప్పలు రోజురోజుకూ పర్వతాల్లా పైకి లేస్తున్నాయి. అయితే.. అందరూ దాన్ని ఒక పనికిరాని వేస్ట్‌‌‌‌‌‌‌‌గానే చూశారు. కానీ.. డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శితారష్మి సాహు మాత్రం భవిష్యత్తులో దానివల్ల పర్యావరణానికి కలిగే హాని గురించి తెలిసి బాధపడేది. అప్పటినుంచి ఆ సమస్య నుంచి రూర్కెలాను ఎలా బయటపడేయాలా? అని రీసెర్చ్ చేయడం మొదలుపెట్టింది. 

సాహూ ఒడిశాలోని రూర్కెలాకు చెందిన ఒక బయోటెక్నాలజిస్ట్. అంతేకాదు.. ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌మెంటల్ టెక్నాలజీ స్పెషలిస్ట్ కూడా. మజ్హిఘారియాని ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మిట్స్‌‌‌‌‌‌‌‌) నుంచి గ్రాడ్యుయేషన్‌‌‌‌‌‌‌‌ పట్టా అందుకుంది. తర్వాత రూర్కెలాలోని నేషనల్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్‌‌‌‌‌‌‌‌)లో పీహెచ్‌‌‌‌‌‌‌‌డీ చేసింది. అదే టైంలో ఆమె ఈ ప్రమాదకర వ్యర్థాలు పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి హాని చేస్తాయని, వృక్షసంపద మీద చాలా ప్రభావం చూపిస్తాయని తెలుసుకుంది. అందుకే ఎంతో రీసెర్చ్‌‌‌‌‌‌‌‌ చేసి చివరకు ఎల్‌‌‌‌‌‌‌‌డీ స్టీల్ స్లాగ్‌‌‌‌‌‌‌‌ను పర్యావరణ అనుకూల ఎరువులుగా మార్చే పరిష్కార మార్గాన్ని కనిపెట్టింది. దీనిద్వారా పెరుగుతున్న వ్యర్థాల సమస్యకు పరిష్కారం చూపడమే కాకుండా నేల ఆరోగ్యం, పంట దిగుబడిని పెంచే ఒక చక్కని ఇన్నోవేషన్‌‌‌‌‌‌‌‌ని రైతులకు అందించింది.

ఇలా మొదైలైంది

సాహుకి ఈ ఆలోచన ఒక్కరోజులో వచ్చింది కాదు. నేల ఆరోగ్యం క్షీణిస్తుండడం, దిగుబడి తగ్గడంతో రైతులు నష్టాలపాలవడం లాంటి ఎన్నో వ్యవసాయ సంబంధిత సమస్యలను చూస్తూ పెరిగింది. ‘‘మా తాత 50 ఎకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించేవారు. దానివల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలగలేదు. కానీ.. ఇప్పుడు రైతులు రసాయనాలు లేకుండా వ్యవసాయం చేయలేకపోతున్నారు. ఈ విధానంలో మార్పు తీసుకురావాలని ఎన్నో ఏండ్ల నుంచి అనుకుంటున్నా. అందుకే వ్యర్థాల నుంచి ఎరువులు తయారుచేయాలనే ఆలోచన వచ్చింది. కానీ.. ఆ దిశగా ఎలా అడుగులు వేయాలో అర్థం కాలేదు. అందుకే దాదాపు మూడేండ్లపాటు రీసెర్చ్‌‌‌‌‌‌‌‌ చేశా. ఎంతోమంది ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్స్‌‌‌‌‌‌‌‌ని కలిశా. పరిష్కార మార్గాలు కనుక్కునేందుకు నా బూట్లు అరిగిపోయేలా తిరిగా. చివరకు ఒక మార్గం దొరికింది’’ అంటూ చెప్పుకొచ్చింది సాహూ. 

ఎంతోమంది.. 

ప్రస్తుతం ఒడిశాలోని 500 మందికి పైగా రైతులు రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఈ ఎరువులను వాడుతున్నారు. ‘‘ఈ ఎరువులు వేసిన పొలాల్లో ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వరి దిగుబడిని ఈ ఎరువు బాగా పెంచుతుంది. కొమ్మకు ఎక్కువ గింజలు వస్తున్నట్టు మా టెస్ట్‌‌‌‌‌‌‌‌ల్లో తేలింది. మేము ప్రస్తుతం కూరగాయల పంటలపై కూడా ప్రయోగాలు చేస్తున్నాం” అంటోంది సాహు. ఒడిశాలోని సుందర్‌‌‌‌‌‌‌‌గఢ్ జిల్లాలో రెండెకరాల్లో వరి పండించే రైతు సునీల్ సింగ్ గత ఖరీఫ్ సీజన్‌‌‌‌‌‌‌‌లో సాహు నుంచి ఎల్‌‌‌‌‌‌‌‌డి-స్లాగ్ బేస్డ్‌‌‌‌‌‌‌‌ బయో ఎరువులను కొన్నాడు. అతను ‘‘మేము వరికి ఈ ఎరువులు వాడాం. గతంతో పోలిస్తే దిగుబడి బాగా పెరిగింది” అని చెప్పాడు. 

అగ్రినోవేషన్‌‌‌‌‌‌‌‌

ఈ ఎరువులు తయారుచేసే ప్రక్రియలో ముందుగా స్లాగ్‌‌‌‌‌‌‌‌ నుంచి విషపూరిత లోహాలను వేరుచేస్తారు. అందులోని సహజ వనరులను పంటకు పనికొచ్చేలా మార్చడానికి ఐదు దశల్లో ప్రాసెసింగ్ చేస్తారు. ఆ తర్వాత దాన్ని పంటకు పనికొచ్చే ఎరువుగా మారుస్తారు. ఇది మొక్కల్లో పోషకాల శోషణ పెరిగేలా చేస్తుంది. నేలలో సూక్ష్మజీవుల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. సాహూ 2020లో ‘బయోటెజ్ అగ్రినోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్’ని మొదలుపెట్టింది. ఈ స్టార్టప్‌‌‌‌‌‌‌‌ ద్వారా తన ఎరువుని అమ్ముతోంది.

 ప్రస్తుతం డాక్టర్ సాహుతోపాటు డైరెక్టర్లు డాక్టర్ మీనా కుమారి, సునీల్ కుమార్ చౌదరి కలిసి దీన్ని నడుపుతున్నారు. నెలకు దాదాపు 2 వేల టన్నుల బయో ఎరువులను తయారు చేస్తున్నారు. దీని ధర కిలోకు రూ. 25–30 వరకు ఉంటుంది. ప్రస్తుతం  50, 30, 5 కిలోల బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఎరువుని వరి పంటకు వేసి, పరీక్షించినప్పుడు దిగుబడి 20 శాతం పెరిగిందని సాహు చెప్పింది. ఇప్పుడు ఈ స్టార్టప్ నుంచి ఎరువులతో పాటు బయో ఫెర్టిలైజర్స్‌‌‌‌‌‌‌‌, బయో కంపోస్ట్‌‌‌‌‌‌‌‌, వర్మీ కంపోస్ట్‌‌‌‌‌‌‌‌, ప్లాంట్‌‌‌‌‌‌‌‌ బూస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంటి అనేక ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌ని తీసుకొచ్చారు.