- పొలాలు, ఫ్యాక్టరీల నుంచి విష రసాయనాలు
- చెత్తాచెదారం అందులోనే..చెరువు కట్టలే డంప్ యార్డులు
- ఒకప్పటి తాగునీటి వనరులు.. ఇప్పుడు కాలుష్య కాసారాలు
- ఆ చెరువుల్లోని చేపలు తింటే లంగ్స్, కిడ్నీలపై ఎఫెక్ట్
- ఆ నీటితో పండిన పంటలు తింటే క్యాన్సర్‌లాంటి రోగాలు
- జీవ వైవిధ్యానికి పెనుముప్పు అంటున్న ఎక్స్పర్ట్స్
నెట్వర్క్, వెలుగు:‘చెరువు.. ప్రాణకోటి నెలవు.. మానవాళి బతుకుదెరువు..’ అన్నాడో కవి. చెరువు గొప్పతనాన్ని గుర్తించిన కాకతీయ రాజులు ఊరూరా గొలుసుకట్టు చెరువులు తవ్విస్తే, నిజాం పాలకులు వాటిని కాపాడుతూ వచ్చారు. ఒకప్పుడు నీళ్ల తాపు.. పశులతాపు.. చాకిరేవు.. మత్తడి.. తూము.. చెరువును విభజించి, నీళ్ల తాపు నుంచి తీసుకెళ్లిన నీటినే ఊరంతా తాగేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. చెరువు నీటిని తాగడం కాదు కదా, పొరపాటున ఆ నీటిలో కాలు పెడ్తే బొబ్బలు వచ్చేంతలా కలుషితమయ్యాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఊరూరా నాలాలు, డ్రైనేజీలను నేరుగా చెరువులకు కలుపుతున్నారు.
ఇలా ఊళ్ల నుంచి వచ్చే మానవ వ్యర్థాలు, పంట పొలాల నుంచి వచ్చే ఎరువులు, పురుగుమందుల అవశేషాలు, ఫ్యాక్టరీల నుంచి వచ్చే విషరసాయనాలతో చెరువులన్నీ విషతుల్యమవుతున్నాయి. వీటితోడు వాడవాడలా సేకరిస్తున్న చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలనూ చెరువుల్లోనే డంప్చేస్తుండడంతో ఒకప్పుడు సమస్త జీవకోటికి నెలవైన చెరువుల్లో ఇప్పుడు చేపలు కూడా బతకలేని పరిస్థితి నెలకొందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
డ్రైనేజీ వాటర్‌లో మెర్క్యురీ, ఆర్సినిక్ వంటి కెమికల్స్ ఉంటాయని, ఆ నీళ్లు కనీసం స్నానానికి, పశువులు కడగడానికి కూడా పనికిరావని ఎక్స్పర్ట్స్చెప్తున్నారు. గొలుసుకట్టు చెరువుల కారణంగా ఒక చెరువు విషపూరితం అయితే వాటి కింద చెరువులు కూడా కలుషితం అవుతున్నాయని, ఆ చెరువుల్లోని చేపలు తిన్నా, ఆ నీటితో పండించిన పంటలను ఆహారంగా తీసుకున్నా లంగ్స్, కిడ్నీలు దెబ్బతింటాయని, పలురకాల క్యాన్సర్లు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
అంతరిస్తున్న అరుదైన చేపలు..
మానవ, పారిశ్రామిక వ్యర్థాలు, పంట పొలాల్లోంచి వచ్చే విష రసాయనాలు కలవడం వల్ల చెరువుల్లో ఆక్సిజన్స్థాయిలు తగ్గిపోయి అరుదైన చేపలు అంతరిస్తున్నాయని మత్స్యశాఖ చెప్తోంది. ఇటీవల హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో వందలాది చెరువుల్లో అధ్యయనం చేసి ఈ విషయాన్ని తేల్చింది. ఆయా జిల్లాల్లోని పరిశ్రమలు, ఫార్మా ఇండస్ట్రీస్ వ్యర్థాలను శుద్ధి చేయకుండా విడుదల చేయడం వల్ల పాదరసం, నికెల్, కాడ్మియం, ఆర్సెనిక్ వంటి ప్రమాదకర రసాయనాలు నేరుగా చెరువుల్లోకి చేరుతున్నాయి. చేపలు బతకాలంటే నీటిలో డిసాల్వ్డ్ ఆక్సిజన్ కనీసం 4 పీపీఎం నుంచి 5పీపీఎం మధ్య ఉండాలి.
కానీ అనేక చెరువుల్లో ఆక్సిజన్లెవల్స్2పీపీఎం కన్నా తక్కువగా ఉన్నట్లు మత్స్యశాఖ గుర్తించింది. అదే సమయంలో నీటిలో కార్బన్ డై ఆక్సైడ్, అమ్మోనియా వంటి హానికర వాయువులు పెరిగి చేపలు మరణిస్తున్నాయని తేల్చింది. మిగిలిన జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఒకప్పుడు చెరువుల్లో చందమామలు, పర్కలు, కొడిపెలు, ఉలిశెలు, గురిజెలు, మాలపంకిర్లు, జెల్లలు, ఇంగ్లిల్కాలు.. లాంటి అరుదైన చేపజాతులు ఉండేవని, ఇప్పుడు వేలాది చెరువుల్లో వాటి జాడ మచ్చుకైనా లేదని మత్స్యకారులు చెప్తున్నారు. కేవలం బొత్స, రాహువు, బంగారుతీగ లాంటి కొన్ని రకాల చేపలే పెరుగుతున్నాయని, చాలా చెరువుల్లో అవి కూడా బతకడం లేదని వాపోతున్నారు.
పశువులకు వాటర్ బార్న్ డిసీజ్..
మానవ, ఫ్యాక్టరీ వ్యర్థాలతో కలుషితమవుతున్న చెరువుల్లో నీటిని తాగే పశువులకు వాటర్ బార్న్ డిసీజ్ వస్తోందని పశువైద్యులు చెప్తున్నారు. లెప్టో స్పైరోసిస్ వ్యాధి సోకి పశువుల్లో లివర్, కిడ్నీ, లంగ్స్ డ్యామేజ్ అవుతున్నాయని చెప్తున్నారు. పెస్టిసైడ్స్, మలమూత్రాలు కలిసిన నీరు తాగడం వల్ల పశువుల కడుపులో మంచి బ్యాక్టీరియా చనిపోయి ప్రొటోజోన్ ఇన్ఫెక్షన్ సోకుతుందని, ఎన్ని మందులు ఇచ్చినా ఈ వ్యాధి తగ్గడం లేదని వివరిస్తున్నారు.
సాల్మోనెల్లా (పశువుల్లో టైఫాయిడ్) సోకితే ట్రీట్మెంట్ చేసినా బతికే చాన్స్ ఉండదంటున్నారు. ఇలాంటి చెరువుల్లో నీళ్లు తాగుతున్న గొర్లలో లీడర్ డ్యామేజ్ జరిగి జాండిస్ తో చనిపోతున్నాయని మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ పశువైద్యాధికారి తెలిపారు. పారిశ్రామిక వ్యర్థాలు కలిసే చెరువుల్లో నీటిని తాగిన పశువులకు మెటల్ యాసిసోడిస్, ఆల్కాలోసిస్ వ్యాధులు సోకుతాయని, ఈ వ్యాధులు సోకితే పశువుల పొట్ట ఉబ్బి, శరీరం విషపూరితమై రెండు, మూడు గంటల్లోనే చనిపోతాయని ఆయన వివరించారు. అందువల్ల ఇలాంటి చెరువుల్లో పశువులకు ఎట్టిపరిస్థితుల్లోనూ నీళ్లు తాగించవద్దని సూచిస్తున్నారు.
ఎస్టీపీలు నిర్మిస్తేనే..
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లలో 2.5 లక్షల ఇండ్లు ఉన్నాయి. వీటి నుంచి ప్రతిరోజు సగటున 120 ఎంఎల్ డీ (మిలియన్ లీటర్ పర్ డే) మురుగునీరు వెలువడుతుండగా, 20.75 ఎంఎల్డీ కెపాసిటీ కలిగిన ఎస్టీపీలు కేవలం మూడు చోట్ల మాత్రమే ఉన్నాయి. దీంతో హనుమకొండ వైపున్న నయీమ్ నగర్ నాలా, వరంగల్ వైపున్న బొందివాగు నాలా, భద్రకాళి నాలాల నుంచి వచ్చే మురుగునీరంతా హసన్ పర్తి మండలంలోని నాగారం చెరువులోకి చేరి కలుషితమవుతోంది.
ఓరుగల్లు లాంటి సిటీలోనే మురుగుజలాల శుద్ధి పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన నగరాలు, పట్టణాల్లో ఎలాంటి పరిస్థితి ఉందో ఊహించుకోవచ్చు. కాగా, చెరువులు జీవావరణంలో కీలకపాత్ర పోషిస్తాయని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. సర్కారు వెంటనే రంగంలోకి దిగి,యుద్ధప్రాతిపదికన ఎస్టీపీ ప్లాంట్లు ఏర్పాటుచేసి, శుద్ధిచేసిన నీరే చెరువుల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి నల్లకుంట చెరువు వ్యర్థజలాలు, కెమికల్స్చేరి ఎర్ర చెరువుగా మారిపోయింది. ఊళ్లోనుంచి మురికి నీరు, చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం చెరువులోకి చేరుతున్నాయి. కలుషితమైన నీళ్లే కాల్వల ద్వారా పొలాలకు చేరుతున్నాయి. చెరువు కింద సాగయిన వందలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బ తిన్నాయి. కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమల వల్ల చెరువు నీటితో పాటు భూగర్భజలాలు కలుషితమై నష్టపోతున్నట్టు సమీప గ్రామాల ప్రజలు వాపోతున్నారు. చెరువును పూర్తిగా శుభ్రం చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులకు అనేక సార్లు విన్నవించినా ఫలితం లేదని అంటున్నారు.
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని కొత్తపల్లిలో డ్రైనేజీల నీరంతా చెరువులోకి చేరుతుంది. ఈ నీటినే ప్యూరిఫై చేసి కొత్తపల్లి పట్టణ ప్రజలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. చెరువుకింద పొలాలున్న రైతులు కలుషిత జాలాలతోనే పంట సాగు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కొత్తపల్లి పట్టణ చెరువు నిండితే రేకుర్తి పెంటకమ్మ చెరువులోకి, నగునూరు వాగులోకి నీరు చేరుతుంది.
ఖమ్మంలోని ఖానాపురం చెరువులోకి నగరంలోని పలు ప్రాంతాల నుంచి మురుగునీరు వచ్చి కలుస్తోంది. గొలుసుకట్టు చెరువుల్లో భాగం కావడంతో.. ఈ చెరువు నిండిన సమయంలో అలుగు ద్వారా నీళ్లు కిందికి పోయి, లకారం చెరువులో కలుస్తాయి. దీంతో లకారం లోకి కూడా కలుషిత జలాలు చేరుతున్నాయి.
మనం వదిలిన కెమికల్స్ తిరిగి మన ఒంట్లోకే..
పట్టణాలు, నగరాల్లో వివిధ ఇండస్ట్రీలతోపాటు ఇళ్ల నుంచి వెలువడే నీటిలో కెమికల్స్ ఉంటాయి. సిటీలో వాహనాలు తిరుగుతుంటే పార్టికల్స్, లెడ్ తదితర ఉద్గారాలు వర్షపు నీళ్లతో కలిసి డ్రైనేజీల ద్వారా చెరువుల్లోకి వస్తాయి. ఈ నీళ్లను పంటలకు వాడితే ఆహారం ద్వారా మనుషుల ఒంట్లోకి, గడ్డి ద్వారా పశువులకు చేరుతాయి.
మురుగునీటిలో ఉండే నైట్రెట్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదముంది. డిటర్జెంట్ లో వాడే కెమికల్స్ కూడా చెరువుల్లోకి చేరి జలాలను కలుషితం చేస్తాయి. చెరువుల్లో కెమికల్స్ కలిస్తే చేపలు చనిపోవడమో లేదంటే వాటి శరీరాల్లోకి చేరడమో జరుగుతుంది. వాటిని తినడం ద్వారా మనుషులు రోగాలబారినపడే ప్రమాదముంది.
- డాక్టర్ దొంతి నర్సింహారెడ్డి, పర్యావరణవేత్త
ఇది మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు. దీనికి నాలుగు వైపుల నాళాలున్నా యి. రెండు వైపుల సైడ్ డ్రైన్లను ఏర్పాటు చేసి చెరువులోకి మురుగునీరు రాకుండా అడ్డు కున్నా.. మిగిలిన రెండు వైపుల నుంచి మరుగునీరు నాళాల ద్వారా చెరువులోకి చేరుతుం ది. చెరువు చుట్టుపక్కల వీధుల నుంచి చెత్తనంతా చెరువు కట్ట మీదే వేస్తుండడంవల్ల ఈ ప్రాంతం డంపింగ్ యార్డును తలపిస్తోంది.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ టౌన్‌లోని మల్లారెడ్డి చెరువు ప్రస్తుతం మురికి కుంటలా మారింది. ఇరవై యేండ్లుగా చెరువు చుట్టూ భూములు కబ్జా అయ్యాయి. చుట్టూ వెలసిన కాలనీల నుంచి డ్రేనేజీ నీరు చెరువులో చేరుతుంది. చుట్టుపక్కల వారు చెత్తనంతా ఇక్కడే పారేస్తూ డంపింగ్ యార్డ్‌గా మార్చేశారు.
జలచరాలకు ప్రాణహాని..
మనుషులు, పశువుల మల,మూత్రాలు చెరువునీళ్లలో కలవడం వల్ల కోలిఫాం బాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీంతో చిన్నచిన్న జలచరాలు చాలా వరకు చని పోయే అవకాశముంది. కోలిఫాంతోపాటు మెడిసిన్ వ్యర్థాలు, హానికారకమైన బాక్టీరి యా చేపల శరీరంలోకి చేరితే వాటి హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీస్తాయి.
ఇలా కలు షిత చెరువుల్లోని చిన్న చేపలను పెద్ద చేప లు తినడం, ఆ చేపలను మనుషులు తిన డం వల్ల బయోఎక్యుమలేషన్ జరిగి కల రా, టైఫాయిడ్ వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముంది. ఇతర దేశాల్లోలాగా మనదేశంలో జలవనరులను కాపాడుకునే వ్యవస్థ లేదు.
- డాక్టర్ కలపాల బాబురావు, పర్యావరణవేత్త, ఐఐసీటీ రిటైర్ట్ సైంటిస్టు
స్నానానికీ పనికిరావు..
పారిశ్రామిక వ్యర్థాలతో పాటు డ్రైనేజీ వాటర్ చెరువుల్లో కలవడం వల్ల నీరు, నేల కలుషితమవుతున్నాయి. దీనికారణంగా జీవవైవిధ్యం దెబ్బతినడంతో పాటు ఆ నీళ్లు తాగిన పశువులు, వాటితో పండిన పంటలు కూడా విషపూరితం అవుతున్నాయి. డ్రైనేజీ వాటర్‌లో మెర్క్యురీ, ఆర్సినిక్ వంటి కెమికల్స్ ఉంటాయి. వీటితో పాటు వివిధ రకాల జబ్బులు కలుగజేసే బ్యాక్టీరియా కూడా చెరువుల్లో కలుస్తోంది.
ఆ నీళ్లు కనీసం స్నానానికి, పశువులు కడగడానికి కూడా పనికిరావు. గొలుసుకట్టు చెరువుల కారణంగా ఒక చెరువు విషపూరితం అయితే, వాటి కింద చెరువులు కూడా కలుషితం అవుతున్నాయి.
- డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, ఎండీ, జనరల్ మెడిసిన్, ఖమ్మం
