ఐటీలో ఒరాకిల్ కలకలం... హాట్ టాపిక్ గా మారిన 30 వేల మంది తొలగింపు  

ఐటీలో ఒరాకిల్ కలకలం... హాట్ టాపిక్ గా మారిన 30 వేల మంది తొలగింపు  
  • ప్రతి ముగ్గురిలో ఒకరిపై వేటు​
  • ఏఐ, డేటా సెంటర్ల వలనే జాబ్​ కట్స్​​
  • మరోసారి లే ఆఫ్స్​ ఉండొచ్చంటున్న ఉద్యోగులు
  • కొత్త స్కిల్స్​ నేర్చుకోవడం అనివార్యం

న్యూఢిల్లీ:  యూఎస్ ​ టెక్ ​ కంపెనీ ఒరాకిల్ గత నెల 31 ఉదయం​ పంపిన ఒక్క ఈ–-మెయిల్ 30 వేల మందిని షాక్​కు గురి చేసింది. ‘మీ ఉద్యోగం పోయింది’ అనేది దాని సారాంశం!  మనదేశం నుంచి సుమారు 12 వేల మందిని తీసేసినట్టు తెలుస్తోంది. ఒరాకిల్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారతీయ ఐటీ రంగంపై, ముఖ్యంగా ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనుంది.  భారత్​లో ఈ సంస్థకు సుమారు 30 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.  12 వేల మంది తొలగింపు అంటే.. సంస్థలో పనిచేస్తున్న  ప్రతి ముగ్గురిలో  ఒకరు  ఉద్యోగం కోల్పోయారని అర్థం. 

సాఫ్ట్​వేర్ రంగంలో ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో కోతలు విధించడం వల్ల టెకీల్లో ఆందోళన నెలకొంది. ఈ క్వార్టర్​ ముగింపులోపు మరోసారి లే ఆఫ్స్​ ఉండొచ్చని హైదరాబాద్​ ఒరాకిల్​ ఆఫీసులో పనిచేసే ఐటీ ఎక్స్​పర్ట్​ ‘వెలుగు’కు చెప్పారు. తొలగించిన వారి అనుభవం ఆధారంగా పరిహారం ఇస్తున్నారని వివరించారు. పాత టెక్నాలజీలపై ఆధారపడి పనిచేస్తున్న వారికి ఇది గడ్డు కాలమని ఆయన వివరించారు. కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడం, నైపుణ్యాలను పెంచుకోవడం అనివార్యమని స్పష్టం చేశారు. ఎన్నో సవాళ్లు

ఒకేసారి వేల సంఖ్యలో టెకీలు మార్కెట్ లోకి రావడం వల్ల పోటీ పెరుగుతుంది.   త్వరగా కొత్త ఉద్యోగం పొందడం కష్టమే! తొలగించిన ఉద్యోగులకు భారీ మొత్తంలోనే పరిహారం అందిస్తున్నా, కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పడే ఈ అనిశ్చితి వారి ఆర్థిక ప్రణాళికలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లోని టెకీలను ఈ పరిణామాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.  

హఠాత్తుగా ఒరాకిల్​ ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకుంది ? ఈ ప్రశ్నకు.. కంపెనీ తన వ్యూహాన్ని ఏఐ, డేటా సెంటర్ల వైపు మళ్లించడమేననే సమాధానం వినిపిస్తోంది.  ఓపెన్ ఏఐ కోసం ఐదేళ్లలో 156 బిలియన్ డాలర్ల (రూ.13 లక్షల కోట్లు) వ్యయంతో ఏఐ డేటా సెంటర్ల నిర్మాణానికి ఒరాకిల్ ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం 30 లక్షల ప్రత్యేక చిప్స్ కొనాలి.  ఈ భారీ పెట్టుబడుల కోసం ఇతర విభాగాల్లో ఖర్చులను కంపెనీ తగ్గిస్తోంది.