చికెన్ పై మార్జిన్ పెంచి న్యాయం చేయాలి.. ధర్నా చౌక్ లో చికెన్ సెంటర్ల నిర్వాహకుల ధర్నా

చికెన్ పై మార్జిన్ పెంచి న్యాయం చేయాలి.. ధర్నా చౌక్ లో చికెన్ సెంటర్ల నిర్వాహకుల ధర్నా

ముషీరాబాద్, వెలుగు: చికెన్​పై మార్జిన్​పెంచి, న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర రిటైల్​చికెన్ షాప్స్​అసోసియేషన్ డిమాండ్ చేసింది. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ పెంచేవరకూ నిరవధిక బంద్​పాటిస్తామని హెచ్చరించింది. చికెన్ పై మార్జిన్ ఇవ్వకపోవడం  పౌల్ట్రీ కంపెనీల తీరుకు నిరసనగా అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్​లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు రాజు, శ్రీనివాస్, గోపి, యాదగిరి, వేముల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇటీవల 26 శాతం ఉన్న మార్జిన్ ను పౌల్ట్రీ కంపెనీలు16 శాతానికి తగ్గించాయని, దీనివల్ల చికెన్ షాపుల నిర్వాహకులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

పౌల్ట్రీ కంపెనీలు రిటైల్ చికెన్ వ్యాపారులకు నష్టం కలిగించే విధంగా చర్యలు తీసుకుంటున్నాయని ఆరోపించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మార్జిన్​ను రూ.50కి పెంచాలన్నారు. షాప్ కిరాయి, నిర్వహణ ఖర్చులు, పనిచేసే బాయ్స్ జీతాలు పెరిగినందున కంపెనీలు ప్రస్తుతం ఇచ్చే మార్జిన్ సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని పౌల్ట్రీ కంపెనీలతో మాట్లాడాలని కోరారు.