హైదరాబాద్, వెలుగు: కాంబోడియా, మయన్మార్ దేశాల్లోని సైబర్ నేరగాళ్ల కాల్ సెంటర్లకు సిమ్ కార్డులు సప్లయ్ చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీ సీఎస్‌బీ) మంగళవారం అరెస్ట్ చేసింది. కాంబోడియాకు తరలిస్తున్న198 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకుంది. సైబర్ క్రైమ్ నెట్‌వర్క్ వివరాలను సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ బుధవారం వెల్లడించారు. ఫేక్ డాక్యుమెంట్లతో 600కు పైగా సిమ్ కార్డులను కాంబోడియా, మయన్మార్‌కు తరలించినట్లు దర్యాప్తులో గుర్తించామన్నారు. హైదరాబాద్ చాంద్రాయణగుట్టకు చెందిన సయ్యద్ అష్రఫ్ అలీ(30) మూడేండ్ల క్రితం దుబాయికి వెళ్లాడు. అక్కడ పరిచయమైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన రిజ్వాన్(29)కు ఇండియాకు చెందిన సిమ్ కార్డులు సరఫరా చేశాడు.
హైదరాబాద్ తలాబ్ కట్టకు చెందిన సయ్యద్ సోహైల్, అతీక్ అహ్మద్‌తో పాటు హనుమకొండకు చెందిన నూనె అశోక్ (29) వద్ద అష్రఫ్ సిమ్ కార్డులు సేకరించి 2023 నుంచి ఆరు సార్లు 600కు పైగా సిమ్ కార్డులను దుబాయిలోని అష్రఫ్‌కు సప్లయ్ చేశారు. ఆ సిమ్ కార్డులను అష్రఫ్, రిజ్వాన్ కాంబోడియా, మయన్మార్‌లోని సైబర్ నేరగాళ్లకు తరలించారు. ఈ సిమ్ కార్డులకు సంబంధించిన ఫోన్ నంబర్లు తెలంగాణ, ఏపీ సహా దేశవ్యాప్తంగా నమోదైన సైబర్ నేరాల్లో బయటపడ్డాయి. వీటి ఆధారంగా టీజీ సీఎస్‌బీ అధికారులు నిందితులందరినీ అరెస్ట్ చేశారు.
