- ఆర్టీసీ కార్మిక సంఘాల నేతల ఫైర్
- జీఎస్టీ, ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసర్లు తాళాలు పగలగొట్టారని ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బస్ భవన్ ఎ– బ్లాక్ లో ఉన్న 4 ఫ్లోర్ లను జీఎస్టీ, ఇన్‌కం ట్యాక్స్ ఆఫీస్లకు కేటాయించడం ఏంటని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఫ్లోర్ లు ఏపీఎస్ ఆర్టీసీ ఆధీనంలో ఉన్నాయని, వాటిని అక్కడి ఆర్టీసీకి లేదంటే తెలంగాణ ఆర్టీసీకి వినియోగించుకునే హక్కు మాత్రమే ఉందని తెలిపారు. బుధవారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన్ భవన్ లో ఆర్టీసీలోని 8 యూనియన్ల నేతలు సమావేశమై, సంస్థలో జరుగుతున్న తాజా పరిణామాలపై చర్చించారు.
టీఎంయూ తరఫున అశ్వత్థామ రెడ్డి, ఎన్‌ఎంయూ నుంచి మర్రి నరేందర్, సీఐటీయూ తరఫున రవీందర్ రెడ్డి, ఐఎన్‌టీయూసీ నుంచి అబ్రహాం, ఇతర యూనియన్ల నేతలు హాజరయ్యారు. జీఎస్టీ, ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసర్లు బస్ భవన్ ఎ–బ్లాక్ లోని 4 ఫ్లోర్ ల తాళాలు పగలగొట్టి, తమ ఆధీనంలోకి తీసుకున్నారని ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం లేదా ఆర్టీసీ యాజమాన్యం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే బస్ భవన్ వద్ద ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామన్నారు. అన్ని యూనియన్లు కలిసిరావాలని, ఆర్టీసీ ఆస్తులను కాపాడుకునేందుకు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
