- అందుకే మోదీ.. బీజేపీ ఓటు బ్యాంక్ ను సీపీఎంకు బదిలీ చేస్తున్నడు: రేవంత్
- కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు గెలవకూడదని చూస్తున్నారని ధ్వజం
- త్రివేండ్రం, అలప్పుజ, ఎర్నాకుళం నియోజకవర్గాల్లో ప్రచారం
హైదరాబాద్, వెలుగు: ‘కేరళ ప్రజలు తెలివైన వారు. బాగా చదువుకున్నోళ్లు. అందుకే ఈ రాష్ట్రంలో ఎప్పటికీ మతతత్త్వ శక్తులను అనుమతించరు’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే ఇక్కడ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు గెలవకూడదని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఏఐసీసీ తరఫున స్టార్ క్యాంపెయినర్ గా సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే బుధవారం ఆయన త్రివేండ్రం, అలప్పుజ, ఎర్నాకుళం నియోజకవర్గాల్లో జరిగిన రోడ్ షోలు, కార్నర్ మీటింగుల్లో పాల్గొన్నారు. ముట్టతారా రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీకి, సీఎం పినరయి విజయన్ కి తేడా ఏమీ లేదని ఆరోపించారు. మతతత్త్వ శక్తులను కేరళలోకి ప్రవేశించకుండా ఇక్కడి ప్రజలు లక్ష్మణ రేఖను గీశారని చెప్పారు.
ఎలాగూ ఇక్కడ తాము అధికారంలోకి రాలేమని భావించిన మోదీ.. ఎల్‌డీఎఫ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న సీఎం పినరయి విజయన్ ద్వారా కేరళం భవిష్యత్తును దొంగలించాలని చూస్తున్నారని రేవంత్ ధ్వజమెత్తారు. అందుకే బీజేపీ నాయకులు తమ ఓటు బ్యాంక్ ను పినరయి విజయన్ కు బదిలీ అయ్యేలా చూస్తున్నారని ఆరోపించారు. ఇది కేరళ ప్రజలు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన సమయమని రేవంత్ గుర్తు చేశారు. ఇక్కడికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి, కేరళను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే పార్టీకి, నేతలకే ఓటు వేయాలని సీఎం రేవంత్ కోరారు. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మళ్లీ సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లకు సీఎం రేవంత్ హాజరయ్యారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కేరళం ఇన్చార్జీ దీపాదాస్ మున్షీతో పాటు లోకల్ లీడర్లతో కలిసి రేవంత్ ఓపెన్ టాప్ జీపులో ప్రజలకు అభివాదం చేస్తూ కాంగ్రెస్, దాని మిత్రపక్షాల అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
