విద్యుత్షాక్ తో  మరణిస్తే రూ.8 లక్షలు

విద్యుత్షాక్ తో  మరణిస్తే రూ.8 లక్షలు
  • ఇప్పటివరకు ఉన్న రూ.5 లక్షల ఎక్స్​గ్రేషియాను పెంచిన ఈఆర్​సీ
  • రెండు నెలల్లోనే చెల్లించాలని డిస్కంలకు ఆదేశం
  • లక్షలాది రైతు కుటుంబాలకు మేలు
  • ఈ ఏడాది విద్యుత్​ శాఖలో రూ.15,105 కోట్ల రెవెన్యూ లోటు
  • రూ.14 వేల కోట్ల సబ్సిడీ ఇవ్వడానికి సర్కారు ఆమోదం
  • డిస్కంల రెవెన్యూ వివరాలు ప్రకటన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రైతులెవరైనా విద్యుత్​షాక్​తో మరణిస్తే బాధిత కుటుంబాలకు రూ.8 లక్షల ఎక్స్ గ్రేషియా అందించాలని విద్యుత్​ డిస్కంలను తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఈఆర్​సీ) ఆదేశించింది. విద్యుత్​శాఖ తరఫున ఇప్పటివరకు రూ.5 లక్షల పరిహారం ఇస్తుండగా ఈ ఏడాది నుంచి మరో రూ.3 లక్షలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ డబ్బులను సంఘటన జరిగిన రెండు నెలల్లోపే బాధిత కుటుంబాలకు అందించాలని స్పష్టం చేసింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ఉత్తర, దక్షిణ డిస్కంలకు సంబంధించిన రిటైల్ సప్లై టారిఫ్ ఆర్డర్​ను బుధవారం ఈఆర్​సీ విడుదల చేసింది. అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్​మెంట్(ఏఆర్ఆర్)తో పాటు రెవెన్యూ లోటు వివరాలను ప్రకటించింది. ఈ ఏడాది విద్యుత్​శాఖలో రూ.15,105 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ సబ్సిడీల కింద రూ.14 వేల కోట్లను డిస్కంలకు అందించడానికి ఆమోదం తెలిపినట్లు వివరించింది. గతేడాది లాగే ఈసారి కూడా డొమెస్టిక్​ కరెంట్​చార్జీలను పెంచడం లేదని తెలిపింది. 

రావాల్సిన ఆదాయం రూ.65,559.29 కోట్లు

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రూ.65,559.29 కోట్ల రెవెన్యూ రావాల్సి ఉండగా.. వినియోగదారుల నుంచి రూ.50,278.60 కోట్లు వసూలు కానున్నట్లు ఈఆర్ సీ స్పష్టం చేసింది. దక్షిణ డిస్కం(ఎస్​పీడీసీఎల్)లో క్రాస్​ సబ్సిడీ సర్​చార్జీ ద్వారా రూ.168.28 కోట్లు, అడిషనల్​సర్​చార్జీ ద్వారా రూ.6.50 కోట్లు(మొత్తం రూ.50,453.38 కోట్లు) సమకూరుతాయని తెలిపింది. మిగతాది రెవెన్యూ లోటు అని పేర్కొంది. ఇందులో వ్యవసాయ ఉచిత విద్యుత్​ సరఫరా పథకం కింద రూ.12,181.21 కోట్లు, గృహలక్ష్మి స్కీంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్​కు సంబంధించి రూ.1,818.79 కోట్లు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని తెలిపింది. ఇంకా రూ.1,105.91 కోట్ల లోటును రెగ్యులేటరీ అసెట్ కిందకు మార్చినట్లు చెప్పింది.  

రాష్ట్రంలో 20 లక్షలకు పైగా రైతు కుటుంబాలు

రూ.8 లక్షల ఎక్స్​గ్రేషియా ఇవ్వడం వల్ల రాష్ట్రంలోని లక్షలాది రైతు కుటుంబాలకు మేలు జరుగుతుందని రైతు సంఘాల ప్రతినిధులు అంటున్నారు. రాష్ట్రంలో 20 లక్షలకు పైగా సన్న, చిన్నకారు, కౌలు రైతుల కుటుంబాలు, 29 లక్షలకు పైగా వ్యవసాయ విద్యుత్​ కనెక్షన్లు ఉన్నాయి. గతంలో రైతులు ట్రాన్స్​ఫార్మర్లు, విద్యుత్​మోటార్లకు రిపేర్లు చేస్తూ విద్యుత్​షాక్​కు గురై చనిపోయేవారు. విద్యుత్​శాఖ ఆఫీసర్లు సరిగా పట్టించుకోక బాధితులకు పరిహారం అందేది కాదు. ఇప్పుడు పరిహారాన్ని పెంచడంతోపాటు రెండు నెలల్లోనే అందించాలని ఆదేశించడం హర్షణీయమని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి వరంగల్​జిల్లాకు చెందిన ఎన్ రెడ్డి హంసరెడ్డి పేర్కొన్నారు.