పుణె: పాకిస్తాన్ ఏజెంట్ విసిరిన హనీట్రాప్ లో చిక్కుకుని రహస్య సమాచారాన్ని లీక్ చేసిన సైంటిస్ట్ పై పోలీసులు తాజాగా చార్జిషీట్ దాఖలు చేశారు. అధికారిక రహస్యాలను లీక్ చేశారనే ఆరోపణలతో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో) సైంటిస్టు ప్రదీప్ కురుల్కర్ ను యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు ఈ ఏడాది మే 3న అరెస్టు చేశారు. ప్రదీప్ ను కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు అతడిని జ్యుడీషియల్ కస్టడీకి పంపించింది. అప్పటి నుంచి జైలులోనే ఉంటున్న ప్రదీప్ పై పోలీసులు తాజాగా చార్జిషీట్ దాఖలు చేశారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఉద్యోగి జరా దాస్ గుప్తాతో వాట్సాప్ సందేశాలు, వీడియో కాల్స్ చేశారని చార్జిషీట్ లో పేర్కొన్నారు. ఈ సంభాషణలు, సందేశాలలో కీలక రహస్యాలను జరా దాస్ గుప్తాతో పంచుకున్నారని చెప్పారు.
