- షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద సీజ్
హైదరాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. ఐరన్ బాక్స్ లో ప్యాక్ చేసి స్మగ్లింగ్ చేస్తున్న కిలో 196 గ్రాములు బంగారం బిస్కెట్లను డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు సీజ్ చేశారు. దీని విలువ రూ. 1.55 కోట్లుగా నిర్ధారించారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆదివారం డీఆర్ఐ అధికారులు పత్రిక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. శంషాబాద్ లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు మీదుగా జరుగుతున్న గోల్డ్ స్మగ్లింగ్ పై హైదరాబాద జోన్ డీఆర్ఐ యూనిట్ నిఘా పెట్టింది.
షార్జా నుంచి బంగారం తరలిస్తున్నారనే ఇంటెలిజెన్స్ సమాచారంతో శుక్ర, శనివారం తనిఖీలు నిర్వహించింది. శుక్రవారం హైదరాబాద్ కు వచ్చిన ఓ ప్యాసింజర్ బ్యాగేజీలో ఐరన్ బాక్స్ ను గుర్తించారు. స్కానర్లకు చిక్కకుండా ప్యాక్ చేసిన 11 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ప్రయాణికుడిని విచారించగా ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరులో హ్యాండ్లర్ వివరాలు వెల్లడించాడు. దీంతో గోల్డ్ స్మగ్లర్, రిసీవర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
