- 7.75 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి సీజ్ ఒకరి అరెస్ట్..
- అంతర్జాతీయ ముఠాలపై ఆరా
హైదరాబాద్,వెలుగు: గీజర్లో దాచి బ్యాంకాక్ నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న రూ.2.71 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో 7.75 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఓ ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. ఈ వివరాలను డీఆర్ఐ హైదరాబాద్ జోనల్ కార్యాలయం మంగళవారం ప్రకటించింది.
బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ భారతీయ ప్రయాణికుడి లగేజీలో గంజాయి ఉన్నట్లు డీఆర్ఐ అధికారులకు సమాచారం అందింది. దీంతో అక్టోబర్ 12న ఎయిర్పోర్టులో అతడి చెక్-ఇన్ లగేజీని తనిఖీ చేశారు. అందులోని ఎలక్ట్రిక్ గీజర్లో అనుమానాస్పదంగా ప్యాక్ చేసిన 73 ప్యాకెట్లను గుర్తించారు. వాటిని తెరిచి పరీక్షించగా హైడ్రోపోనిక్ గంజాయిగా తేలింది. మొత్తం 7.75 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ అక్రమ మార్కెట్లో దీని విలువ రూ.2.71 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు డీఆర్ఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
