మల్లన్నసాగర్​ నుంచి సిటీకి తాగునీరు

మల్లన్నసాగర్​ నుంచి సిటీకి తాగునీరు
  • గ్రేటర్​ పరిధిలో నీటి సమస్య రాకుండా వాటర్​బోర్డు చర్యలు
  • రూ.1.32 కోట్లతో మల్లన్నసాగర్​ నుంచి ముర్మూర్​ట్రీట్​మెంట్​ప్లాంట్ ​వరకు కొత్తగా పైప్​లైన్​
  • శామీర్ పేట, జీడిమెట్ల, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కూకట్​పల్లి ప్రాంతాలకు సరఫరా

హైదరాబాద్, వెలుగు:  గ్రేటర్​ హైదరాబాద్ పరిధిలో తాగునీటి సమస్య రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. సరఫరాలో సమస్యలు ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా అందించాలని నిర్ణయించింది. ఉస్మాన్​సాగర్, హిమాయత్​సార్​కాండ్యూట్​పై వర్టికల్​ ట్రీట్​మెంట్​ప్లాంట్లు నిర్మించి పరిసర ప్రాంతాలకు నీటి సరఫరా చేయాలని భావిస్తోంది. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, మేడ్చల్, శామీర్​పేటతోపాటు ఔటర్​రింగ్​రోడ్​పరిసర ప్రాంతాల్లో నీటి ఎద్దడి రాకుండా చుట్టుపక్కల రిజర్వాయర్ల నుంచి నీటిని అందించేందుకు వాటర్​బోర్డు అధికారులు రెడీ అవుతున్నారు.

 మల్లన్న సాగర్​ నుంచి 100 ఎంఎల్ డీల నీటిని తరలించేందుకు ఇప్పటికే మిషన్ భగీరథ, ఆర్​డబ్ల్యూఎస్ అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఎల్లంపల్లి నుంచి సిటీకి తరలిస్తున్న గోదావరి జలాల్లో 32 ఎంజీడీల నీటిని ఆర్ డబ్ల్యూఎస్, మిషన్​భగీరథ అధికారులు తీసుకుంటున్నారు. ఈ నీటిని గజ్వేల్, ఆలేరు, భువనగిరి, బీబీనగర్​తదితర ప్రాంతాల ప్రజలకు అందిస్తున్నారు. అందుకు బదులుగా మల్లన్న సాగర్​నుంచి100ఎంఎల్​డీల నీటిని తరలించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇందుకోసం మల్లన్న సాగర్ నుంచి ముర్మూర్​లోని నీటి శుద్ధి కేంద్రానికి రూ.1.32 కోట్లతో పైప్​లైన్​ నిర్మాణం చేపడుతున్నారు. 

పనులు పూర్తయిన వెంటనే మల్లన్నసాగర్ నుంచి 100ఎల్​ఎల్డీల నీటిని శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్​పల్లి, మేడ్చల్, శామీర్​పేటతోపాటు ఓఆర్ఆర్​పరిధిలోని మరికొన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నారు. ఇది కాకుండా ఉస్మాన్​సాగర్​నుంచి 90.92 ఎంఎల్డీ, హిమాయత్​సాగర్ నుంచి 25.54 ఎంఎల్డీ, సింగూరు నుంచి 491.19 ఎంఎల్డీ, కృష్ణా ప్రాజెక్టు మూడు దశల నుంచి 1254.37 ఎంఎల్డీ, గోదావరి ప్రాజెక్టు ద్వారా 740.27 ఎంఎల్డీ నీటిని అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. 

12 గంటల్లోపే ఇంటి ముందుకు ట్యాంకర్

బోర్డు పరిధిలో ఇప్పటి వరకు 640 ట్యాంకర్లు ఉండగా, తాజాగా ఆ సంఖ్యను 840కు పెంచినట్లు వాటర్ ​బోర్డు అధికారులు తెలిపారు. ఆర్టీఏతో కలిసి మరికొన్ని ట్యాంకర్లను సమకూర్చుకుంటున్నట్లు చెప్పారు. రెండు, మూడు రోజుల్లో బుక్ ​చేసుకున్న12 గంటల్లోపే ట్యాంకర్ ​అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ట్యాంకర్ల సరఫరా ఏప్రిల్​ నెలలో 2.50 లక్షలకు చేరే అవకాశం ఉందని, మే, జూన్ ​నెలల్లో 3 లక్షలకు పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. డెయిలీ ట్యాంకర్ల ద్వారా పగలు 7,164 ట్రిప్పులు, రాత్రి సమయాల్లో 608 ట్రిప్పుల ద్వారా నీటిని అందిస్తున్నట్లు చెప్పారు.