ఎండలు ముదరకముందే ఏజెన్సీలో తాగునీటి కష్టాలు

ఎండలు ముదరకముందే ఏజెన్సీలో తాగునీటి కష్టాలు
  • ఆదివాసీలకు అందని భగీరథ..  చెలిమె నీళ్లే దిక్కు
  • ఎండలు ముదరకముందే ఏజెన్సీలో తాగునీటి కష్టాలు
  • బావులు, బోర్లలో అడుగంటుతున్న నీళ్లు 
  • 500కు పైగా గూడాలు, తండాలకు గోస   
  • బిందెలు, కావళ్లతో వాగులు, వంకల బాట 
  • కొన్నిచోట్ల ఇంకా పూర్తికాని భగీరథ పనులు
  • మారుమూల గ్రామాల్లోని ట్యాంకులకు ఎక్కని నీళ్లు


వెలుగు, నెట్​వర్క్: ఎండలు ముదరకముందే ఏజెన్సీలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఆదిలాబాద్​, కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్​కర్నూల్, ములుగు జిల్లాల్లోని సుమారు 500కు పైగా గూడాలు, తండాల్లో సమస్య తీవ్రంగా ఉంది. గోదావరి, కృష్ణా వెంట ఉండే ఈ ఏజెన్సీ గ్రామాల్లో సాధారణంగా మేలో భూగర్భ జలాలు అడుగంటుతాయి. కానీ ఈసారి మార్చిలోనే బావులు, బోర్లు ఎండుతున్నాయి. ఏజెన్సీలోని చాలా గ్రామాలకు మిషన్ భగీరథ కింద పైపులైన్లు వేసి, నల్లా కనెక్షన్లు ఇచ్చినప్పటికీ ఓవర్​హెడ్​ట్యాంకులకు నీళ్లు ఎక్కడం లేదు. 
ఇటు భగీరథ నీళ్లు రాకపోవడం, అటు బోరు బావులు ఎండిపోవడంతో ఆయా చోట్ల గిరిజనులు గుక్కెడు నీటికి అరిగోస పడ్తున్నారు. తెల్లారి లేచింది మొదలు బిందెలు, కావళ్లతో వాగులు, వంకల బాట పడుతున్నారు. కిలోమీటర్ల కొద్దీ నడిచి  చెలిమె నీటిని తెచ్చుకుంటున్నారు. కుటుంబంలో ఒకరిద్దరు మనుషులు కేవలం నీళ్లు మోసుకొచ్చేందుకే పనులు మానేసి ఇంటివద్ద ఉండిపోతున్నారు. 

భద్రాద్రి జిల్లాలో 300 గ్రామాలకు కష్టాలు..    

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు 300 ఏజెన్సీ గ్రామాలకు భగీరథ నీళ్లు అందడం లేదు. ఏండ్లు గడుస్తున్నా ఓవర్​హెడ్​ట్యాంకులు, పైపులైన్ల పనులు పూర్తికాకపోవడంతో గిరిజనులకు కష్టాలు తప్పడం లేదు. పాల్వంచ మండలంలో 9, ఆళ్లపల్లి మండలంలో 6, సుజాతనగర్‍లోని 20 గ్రామాలకు నీళ్లు అందడం లేదు. ములకలపల్లి మండలంలోని రేగులకుంటకు నెల నుంచి భగీరథ వాటర్ వస్తలేవు. ఇక్కడ ఒకే బోరు ఉండడంతో ఒక్కో కుటుంబానికి కేవలం రెండు బిందెల నీళ్లు మాత్రమే వస్తున్నాయి. చర్ల మండలం కుర్నపల్లి, పులిగుండాల, ఎర్రబోరు, బత్తినపల్లి గ్రామాల్లోని గిరిజనులు వాగులు, చెలిమెల నీటిపై ఆధారపడుతున్నారు. దుమ్ముగూడెం మండలం ములకనపల్లిలో 350 జనాభా ఉంది. నాలుగేండ్ల కింద ట్యాంకు కట్టి, పైపులైన్లు వేశారు. మెయిన్​పైపులైన్​పూర్తికాకపోవడంతో గ్రామస్తులు బోర్లపైనే ఆధారపడుతున్నారు. 

ములుగులో 4వేల మందికి వాగు నీళ్లే..  

ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లోని ఏజెన్సీ గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. వెంకటాపురం మండలంలో రూ.18 కోట్లతో, వాజేడు మండలంలో రూ.11 కోట్లతో భగీరథ పనులు చేశారు. గ్రామాల్లోని ఓవర్​హెడ్​ట్యాంకులకు నీళ్లు ఎక్కడం లేదు. దీంతో వెంకటాపురంలోని సీతారాంపురం, కొత్తగుంపు, కలిపాక, తిప్పాపురం, పెంకవాగు, ఎదిర పూజరి గుంపు, కారంవారి గుంపు, వాజేడులోని కొత్త చింతూరు, టేకులగూడెం తదితర గ్రామాల్లోని సుమారు 4 వేల మంది వాగులు, వంకలను ఆశ్రయిస్తున్నారు. 11 ఏజెన్సీ గ్రామాల్లో సమస్య తీవ్రంగా ఉందని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆర్​డబ్ల్యూఎస్​  ఏఈ చంద్రశేఖర్ చెప్పారు. ఇక నాగర్​కర్నూల్ జిల్లా అమ్రాబాద్, పదర మండలాల్లోని తొమ్మిది పెంటలకు భగీరథ నీళ్లు రావడం లేదు. వట్వర్లపల్లి గ్రామానికి ఒకే ఒక్క బావి దిక్కయింది. దీనికి సోలార్ మోటార్ ఫిట్ చేసి వాటర్ ఇస్తున్నారు. ఎండలు ముదిరితే ఈ బావి ఎండిపోయే ప్రమాదం ఉంది. అచ్చం పేట, పదర, అమ్రాబాద్, బల్మూర్, కొల్లాపూర్,  లింగాల మండలాల్లోని 96 ఏజెన్సీ గ్రామాలకు ప్రస్తుతం భగీరథ ద్వారా నీళ్లు అందుతున్నా, మరో 15 రోజులైతే చాలా ఊర్లకు నీళ్లు చేరడం కష్టమేనని ఆఫీసర్లు అంటున్నారు.  

ఆసిఫాబాద్ లో 200 ఊళ్లకు నీళ్లు వస్తలేవ్.. 

ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ రూరల్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, గాదిగూడ,  నార్నూర్ మండలాల్లో 20 గ్రామాలకు భగీరథ నీళ్లు అందడం లేదు. ఈ గ్రామాల్లో 3 వేలకు పైగా ఉన్న జనం వాగులు, వంకలు, చెలిమె నీళ్లపై ఆధారపడుతున్నారు. గాదిగూడలోని చిన్న కుండిశేకు గూడ గ్రామస్తులు తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ ఇటీవల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. కానీ ఆఫీసర్లు ఇప్పటి వరకు సమస్యను పరిష్కరించలేదు. ఇక కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని  జైనూర్, కెరమెరి, సిర్పూర్ (యు), లింగాపూర్, తిర్యాణి, చింతలమానేపల్లి మండలాల్లోని దాదాపు 200 ఊళ్లకు భగీరథ నీళ్లు అందట్లేదు. ఆయా తండాలు, గూడాల్లోని గిరిజనులకు వాగులు, బోర్లే దిక్కవుతున్నాయి. తిర్యాణి మండలంలోని ఇర్కపల్లి, చింతపల్లి, తిర్యాణి, భీమారం, మంగి, కేరెగూడ, తాటిగూడ, గోపేర, గోవేన, రొంపల్లి, మాణిక్యపూర్, గిన్నెదరి, గుడిపేట్, కొర్లోంక, మొర్రిగూడ, జైనూర్ మండలంలోని గౌరీ, మార్లవాయి, శివనూర్ డబ్బోలి,  సిర్పూర్ (యు) మండలంలోని పెద్ద దోబా, చిన్న దోబా, పులారా, కోహినూర్, రాగపూర్ తదితర గ్రామాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. లింగాపూర్ మండలంలోని రెంగరీట్ కోలాం గ్రామంలోని గిరిజనులు కిలోమీటర్​ దూరం నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు.

చెలిమె నీళ్లే తాగుతున్నం 

మా ఊరికి భగీరథ నీళ్లు వస్తలేవు. ఎండలు ముదరడంతో బావులు, బోర్లన్నీ ఎండిపోయాయి. దీంతో చెలిమె నీళ్లు తెచ్చుకొని తాగుతున్నం. ఇందుకోసం గుట్టలు ఎక్కుతున్నం. ప్రతిరోజు అడవిలో 3 నుంచి 4 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఆఫీసర్లు మా సమస్యను పరిష్కరించాలి.
-  కుంజా పార్వతి, సీతారాంపురం, వెంకటాపురం మండలం, ములుగు జిల్లా

కిలోమీటర్లు పోతున్నం.. 

మా ఊళ్లో భగీరథ ట్యాంక్‌‌ కట్టారు. కానీ దానికి మెయిన్‌‌ పైప్‌‌లైన్‌‌ కనెక్షన్‌‌ ఇవ్వలేదు. దీంతో ట్యాంక్‌‌లోకి నీళ్లు‌ ఎక్కడం లేదు. నీళ్ల కోసం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాత చింతూరు గ్రామానికి వెళ్లాల్సి వస్తోంది. 
- పెద్ది జగపతి, కొత్త చింతూరు, వాజేడు మండలం, ములుగు జిల్లా 

నాలుగు కిలోమీటర్లు నడిస్తేనే నీళ్లు..

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని సీతారాంపురం గ్రామం మండల కేంద్రానికి 22 కిలోమీటర్ల  దూరంలో ఉంటుంది. ఇక్కడ 300 మంది గిరిజనులు ఉంటున్నారు. మిషన్ భగీరథ స్కీమ్ కింద వాటర్ ట్యాంక్ నిర్మించినా పైపులైన్​ పూర్తి కాకపోవడంతో నీళ్లు రావడం లేదు. భూగర్భ జలాలు కూడా అడుగంటడంతో అడవిలో 3 నుంచి 4 కిలోమీటర్లు నడిచి వెళ్లి ఇలా ఓ చిన్న వాగు పక్కన చెలిమె నీటిని తెచ్చుకుంటున్నారు.