ఆ గ్రామంలో తాగునీటి కోసం పంట పొలాలకు క్యూ

ఆ గ్రామంలో తాగునీటి కోసం  పంట పొలాలకు క్యూ

ఆ గ్రామంలో గుక్కెడు నీళ్లు కావాలంటే వ్యవసాయ బావుల దగ్గరకు వెళ్లాలి. మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఉన్న నీళ్లు రాకపోవడంతో పిల్లపాపలతో ఇంటిల్లిపాది పంట పొలాలకు క్యూ కడుతున్నారు. వ్యవసాయ బోర్లకు పైప్ లైన్ కనెక్షన్లు కలుపుకొని గొంతు తడుపుకుంటున్నారు. సమయానికి కరెంటు లేకపోయినా, బావి ఎండినా వాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా ఉటుంది. గుక్కెడు నీటి కోసం వాళ్లు పడుతున్న కష్టాలెంటో చూద్దాం.

ఇక్కడ మనం చూస్తున్నది మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రాతినిత్యం వహిస్తున్న జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని రాంబధ్రునిపల్లి. ఈ గ్రామంలో గుక్కెడు నీళ్ల కోసం అష్టకష్టాలు పడుతున్నారు జనం. ప్రతి యేటా ఈ ఊర్లో ఇదే పరిస్థితి ఉంటుంది. రెండు వందల కుటుంబాలు నివసిస్తున్న రాంబధ్రునిపల్లిలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. 12 బోర్లు ఉన్నా వేసవి కాలం కావడంతో నీటి జలాలు అడుగంటిపోయాయి. మిషన్ భగీరథ నీళ్లురాక, చేతిపంపు బోర్లలో నీరు అడుగంటి పోవడంతో వ్యవసాయ బావులే దిక్కుగా మారాయి. దీంతో గ్రామంలోని ప్రజలు వ్యవసాయ బావులకు చిన్న చిన్న మోటర్లు బిగించుకుంటూ నీటిని వినియోగిస్తున్నారు. 

కరెంట్ లేని టైంలో బిందెలు పట్టుకొని వ్యవసాయ బావుల దగ్గరికెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. అంత దూరం వెళ్లి నీళ్లను తోడుకుని.. బిందెలు మోసుకు రావడం ఇబ్బందిగా ఉందంటున్నారు మహిళలు. వేసవి కాలానికి తోడు పక్కనే ఉన్న నామాపూర్, దీకొండ, ల్యగలమర్రి గ్రామాల్లో కాలేశ్వరం పంప్ హౌస్ పనులు జరుగుతుండడంతో కరెంటు కూడా సరిగ్గా ఉండటం లేదంటున్నారు. దీంతో నీటి కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రాస్తులు.  నీటి తొట్టిలో నీళ్లు లేక పశువులు అల్లాడిపోతున్నాయంటున్నారు. ఇప్పటికైనా మంత్రి కొప్పుల ఈశ్వర్, అధికారులు స్పందించి నీళ్ల కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.