కరీంనగర్ లో భగీరథ నీళ్లు మూడ్రోజులకోసారి

కరీంనగర్ లో భగీరథ నీళ్లు మూడ్రోజులకోసారి
  • కరీంనగర్ లో పైలెట్​ ప్రాజెక్టు ఫెయిల్ 
  • తాగునీటికి తిప్పలు పడుతున్న ప్రజలు 
  • అరగంట లేదా గంటనే వాటర్ సప్లై 
  • ట్యాంకర్లతో నీళ్లు తెప్పించుకుంటున్న జనం 
  • దెబ్బతిన్న పైపులను 6 నెలలైనా రిపేర్ చేయని అధికారులు  


వెలుగు: “5 వేల కనెక్షన్లకు 24 గంటలూ వాటర్ ఇచ్చే కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా కరీంనగర్​లో ప్రారంభించుకుంటున్నం. రాష్ట్రంలో ఇదే ఫస్ట్​టైమ్. ఇది మనందరికీ గర్వకారణం. 5 వేలు కాదు.. మొత్తం నగరంలోని 52 వేల నల్లా కనెక్షన్లకు కూడా 24 గంటలూ వాటర్​ఇస్తమని ఆడబిడ్డలకు మనవి చేస్తున్నం’’.  

 ఈ నెల 17న కరీంనగర్ లో పైలెట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ చెప్పిన మాటలివి. కానీ, సిటీలో మూడు రోజులకు ఒకసారి కూడా నీళ్లు సక్కగా రావడం లేదు. చాలాచోట్ల గంట, అరగంటకు మించి సరఫరా చేయడం లేదు. అవి కూడా సరిగ్గా ఎన్ని గంటలకు వస్తాయో తెలియడం లేదు. ఆ కొద్దిపాటి నీటి కోసం రోజూ పిట్టకు పెట్టినట్లు ఎదురుచూడాల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలం మొదట్లోనే పరిస్థితి ఇట్ల ఉంటే, ఇంకా మున్ముందు ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. 

రూ.100 కోట్లతో భగీరథ పనులు..  

కరీంనగర్ జనాభా 3.5 లక్షలు. మొత్తం 60 డివిజన్ల పరిధిలో దాదాపు 52 వేల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఇక్కడ 2020 జులైలో మిషన్ భగీరథను ప్రారంభించారు. డ్యామ్ పక్కనే ఉన్నప్పటికీ, ఈ స్కీమ్ కింద ఇంటింటికీ నీళ్లు ఇచ్చేందుకు ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు చేశారు. గతంలో 210 కిలోమీటర్ల మేర పాత పైప్ లైన్ ఉండగా, భగీరథలో భాగంగా మరో 105 కిలోమీటర్ల కొత్త పైపులైన్ వేశారు. కొత్తవి, పాతవి కలిపి 16 ఓవర్​హెడ్​ట్యాంకులు ఉన్నాయి. కాగా ఇటీవల భగత్ నగర్, కోతిరాంపూర్, కట్టా రాంపూర్,  హౌసింగ్ బోర్డు కాలనీల్లోని 5 వేల కనెక్షన్లకు 24 గంటలూ నీళ్లు ఇచ్చేందుకు పైలెట్ ప్రాజెక్టును కేటీఆర్ ప్రారంభించారు. వాటర్ సప్లై కోసం కొత్తగా శాతవాహన యూనివర్సిటీ ఆవరణలో 30 లక్షల లీటర్లు, హౌసింగ్ బోర్డు కాలనీలో 20 లక్షల లీటర్లు, రామ్ నగర్ లో 13 లక్షల లీటర్ల కెపాసిటీతో మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు నిర్మించారు. ఇంత చేసినప్పటికీ ప్రజలకు నీళ్లు అందడం లేదు. పైలెట్ ప్రాజెక్టుకు ఎంపిక చేసిన కాలనీల్లోనూ మూడ్రోజులకు ఒకసారే నీళ్లు వస్తున్నాయి. 

పాత పైపులు.. తరచూ రిపేర్లు 

ఈ స్కీమ్ కోసం రూ.100 కోట్లు ఖర్చు చేసినప్పటికీ.. పైపులైన్లు, ట్యాంకులు సగానికి పైగా పాతవే కావడంతో తరచూ రిపేర్లు వస్తున్నాయి. లీకేజీలతో ప్రజలకు నీళ్లు అందడం లేదు. మరోవైపు డ్యామ్ నుంచి నీటిని సరఫరా చేసే ఇన్ టెక్ పైపులు దెబ్బతిని ఆరు నెలలైనా అధికారులు రిపేర్ చేయకపోవడంతో ఈ దుస్థితి తలెత్తింది. లోయర్ మానేరు డ్యామ్ నీటిమట్టం 920 ఫీట్లు కాగా, ప్రస్తుతం 897.05 ఫీట్లకు పడిపోయింది. మిడ్​మానేరు నుంచి వాటర్​ తెచ్చుకునే అవకాశం ఉన్నప్పటికీ, అక్కడి నుంచి మల్లన్నసాగర్​కు తరలిస్తున్నారు. ఎల్ఎండీలో పూర్తిస్థాయిలో వాటర్ ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు వాటర్ లెవల్ తగ్గడంతోనే సమస్య మొదలైంది. డ్యామ్​నుంచి ఫిల్టర్​బెడ్​కు వాటర్​సప్లై చేసే 800 డయా పైపులు(బూస్టర్స్) ఆరు నెలల కింద వరదలు వచ్చి గేట్లు ఎత్తినప్పుడు కొట్టుకుపోయాయి. అప్పటి నుంచి వాటి గురించి పట్టించుకోని అధికారులు.. ఇటీవల కేటీఆర్ పర్యటన నేపథ్యంలోనే పనులు ప్రారంభించారు. ఆ పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. 

ట్యాంకర్లే దిక్కు... 

ఎల్​ఎండీలో నీటి మట్టం తగ్గడంతో నీళ్ల సరఫరా కూడా తగ్గింది. సిటీకి ప్రతిరోజూ 60 ఎంఎల్​డీ ల వాటర్ అవసరం కాగా, ప్రస్తుతం 25 ఎంఎల్ డీల వాటర్ మాత్రమే సప్లై చేస్తున్నారు. లో ప్రెషర్ తో నీళ్లు వస్తున్నాయి. ఫలితంగా సుభాశ్​నగర్, కార్ఖానగడ్డ, కిసాన్ నగర్, వావిలాలపల్లి, జ్యోతినగర్, కోతిరాంపూర్, కట్టారాంపూర్, తీగలగుట్టపల్లి తదితర ఏరియాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. పట్టుమని రెండు బిందెలు కూడా నిండకముందే నల్లాలు బంద్​అవుతున్నాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో జనమే డబ్బులు పెట్టి ట్యాంకర్లు తెప్పించుకుంటున్నారు.  

టైమ్ ఉంటలేదు.. 

నేను పొద్దున ఇంట్ల పన్జేసుకొని షాప్ కు పోత. టైమ్ ప్రకారం పొద్దున పూట నీళ్లు వస్తేనే కదా పనులయ్యేది. అసలు అవి ఎప్పుడు వస్తున్నయో తెలుస్తలేదు. ఓసారి పొద్దున, ఓసారి రాత్రి.. అదీ అరగంట, గంట ఇస్తున్నరు. 
- శోభ, కట్టా రాంపూర్