ఆటోను తిరిగివ్వకపోతే బ్రిడ్జిపై నుంచి దూకుతా

ఆటోను తిరిగివ్వకపోతే బ్రిడ్జిపై నుంచి దూకుతా

శంషాబాద్,వెలుగు: ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్న తన ఆటోను తిరిగివ్వకపోతే  బ్రిడ్జిపై నుంచి దూకుతానంటూ డ్రైవర్ హల్​చల్ చేశాడు. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టు పీఎస్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..ఫిబ్రవరి 28న అర్ధరాత్రి తొండుపల్లి వద్ద ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. మద్యం మత్తులో ఆటో నడుపుతూ వచ్చిన నాగరాజును ఆపి బ్రీత్ అనలైజర్ టెస్టు చేశారు. నాగరాజు మద్యం తాగినట్లు గుర్తించారు. అతడి ఆటోను స్వాధీనం చేసుకున్న పోలీసులు   కౌన్సెలింగ్ కు హాజరు కావాలని చెప్పారు. నాగరాజు కౌన్సెలింగ్​కు హాజరైన తర్వాత తన ఆటోను తిరిగి ఇప్పించాలని నెలరోజులకు పైగా శంషాబాద్ ట్రాఫిక్ పీఎస్ చుట్టూ తిరుగుతున్నాడు. అయినా అతడికి పోలీసులు ఆటో ఇవ్వలేదు. దీంతో శుక్రవారం ఎయిర్ పోర్టు పీఎస్ ఎదురుగా కొత్తగా కడుతున్న  బ్రిడ్జిపైకి ఎక్కిన నాగరాజు తన ఆటోను ట్రాఫిక్ పోలీసులు తిరిగివ్వకపోతే కిందకి దూకి సూసైడ్ చేసుకుంటానని బెదిరించాడు. ఆ రూట్​లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో ఎయిర్ పోర్టు పోలీసులు అక్కడికి చేరుకున్నారు.  ఆటోను తిరిగి ఇప్పిస్తామని నాగరాజుకు హామీ ఇచ్చి కిందకి దింపారు.  అతడిని అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మరోవైపు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయడం, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో వెహికల్స్ ను స్వాధీనం చేసుకుంటున్న శంషాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు చలాన్లు పంపడం, కోర్టులో హాజరుపరచడం లాంటివి చేయడం లేదని బాధితులు చెప్తున్నారు. శంషాబాద్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో తనిఖీల్లో పట్టుబడ్డ వెహికల్స్ వేలల్లో ఉన్నాయని బాధిత వాహనదారులు అంటున్నారు.