Dronacharya Awardee Gymnastics Coach: ముంబైలోని విలే పార్లే పోలీస్ స్టేషన్ పరిధిలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. తన దగ్గర శిక్షణ పొందుతున్న 16 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై 48 ఏళ్ల ద్రోణాచార్య అవార్డు గ్రహీత, జిమ్నాస్టిక్స్ కోచ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు పోక్సో (POCSO) చట్టం, భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
మెసేజ్ చేసి జిమ్‌కు పిలిపించి:
బాధితురాలు గత కొన్నేళ్లుగా సదరు కోచ్ దగ్గరే జిమ్నాస్టిక్స్ లో శిక్షణ పొందుతోంది. శుక్రవారం ఉదయం ఆమె ఇంట్లో చదువుకుంటుండగా కోచ్ ఫోన్ నుంచి Hi అని వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది. బాలిక ఈ విషయాన్ని తన తల్లికి తెలపగా, ఎందుకు మెసేజ్ చేశారని అడగమని తల్లి సలహా ఇచ్చింది. బాధితురాలు ప్రశ్నించగా, జిమ్నాసియమ్‌కు రాగలవా అని కోచ్ కోరాడు. క్రీడలకు సంబంధించిన విషయాలు మాట్లాడటానికే పిలిచాడనే నమ్మకంతో బాలిక జిమ్‌కు వెళ్లింది.
జిమ్‌లో అఘాయిత్యం:
బాలిక అక్కడికి వెళ్లేసరికి కోచ్ ఒక్కడే ఉన్నాడు. చెప్పులు లోపలికి తెచ్చి, తలుపు లాక్ చేయమని అతడు చెప్పాడు. మొదట కాలేజీ, చదువుల గురించి సాధారణంగా మాట్లాడిన కోచ్... ఆ తర్వాత హఠాత్తుగా బాలిక ఎడమ చేయి పట్టుకుని తన ఒడిలోకి లాక్కున్నాడు. ఆమె అతడి ఒళ్లో నుంచి లేవడానికి ప్రయత్నించగా, వెనుక నుంచి నడుము పట్టుకుని లైంగికంగా వేధించాడు. దీంతో బలవంతంగా అతడి నుంచి తప్పించుకుని పారిపోయింది.
టీచర్ సహాయంతో పోలీసులకు ఫిర్యాదు:
ఈ ఘటన తర్వాత అక్కడి నుంచి బయటపడిన బాలిక నేరుగా కాలేజీకి వెళ్లింది. తీవ్ర ఆందోళనలో ఉన్న ఆమెను చూసి స్నేహితులు విచారించగా, జరిగిన విషయాన్ని తెలియజేసింది. అనంతరం ఈ ఘటన గురించి కాలేజీ టీచర్‌కు తెలపడంతో, వారు బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విలే పార్లే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిమ్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్, వాట్సాప్ చాట్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితుడైన కోచ్‌ను అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Mumbai Police have registered a POCSO case against a 45-year-old Vile Parle-based gymnastics coach and Dronacharya Award recipient, following an allegation of sexual assault involving a 16-year-old student. The complaint states that the coach called the minor to the gymnasium,… pic.twitter.com/2L4utozRkQ
— IANS (@ians_india) August 24, 2026
