రాజ్ భవన్​లో సందడిగా ఎట్ హోం

రాజ్ భవన్​లో సందడిగా ఎట్ హోం

హైదరాబాద్, వెలుగు: రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్ భవన్​లో గవర్నర్ తమిళిసై ఆధ్వర్యంలో ఎట్ హోం సందడిగా సాగింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, శ్రీధర్ బాబుతో పాటు హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ రవిగుప్తా, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఏఐసీసీ నేత రణదీప్ సింగ్ సుర్జేవాల, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, స్వాతంత్ర్య సమరయోధులు హాజరయ్యారు.

ఇటీవల పద్మశ్రీ అవార్డు వచ్చిన దాసరి కొండప్ప, కేతావత్ సోమ్లాల్, వేలు ఆనందాచారి, కూరెళ్ల విఠలాచార్య పత్ర్యేక ఆకర్షణగా నిలిచారు. వారిని శాలువా, షీల్డ్ తో గవర్నర్ సన్మానించారు. మాజీ గవర్నర్లు విద్యా సాగర్ రావు, పీఎస్ రామ్మోహన్ రావు, బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్​ రెడ్డి పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు దూరంగా ఉన్నారు. ఈ పార్టీ నుంచి ఎవరూ అటెండ్ కాలేదని అధికార వర్గాలు తెలిపాయి. ఎట్ హోం లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో గవర్నర్​విడివిడిగా, సరదా మాట్లాడారు. గత ప్రభుత్వంలోనూ  సీఎం, గవర్నర్​ల మధ్య విభేదాలతో సీఎం, మంత్రులు, ఎమ్మెల్సీలు దూరంగా ఉండగా కేవలం ప్రతిపక్ష నేతలతో ఇతర ప్రముఖులతో ఎట్ హోం కొనసాగిన సంగతి తెలిసిందే.