- సరైన టైమ్ లో చికిత్స ఇస్తే బాధితులను కాపాడుకోవచ్చు: మంత్రి దామోదర
- గాంధీ హాస్పిటల్ నుంచి 35 డీఅడిక్షన్ సెంటర్లు ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు బానిస అవడాన్ని సామాజిక సమస్యగా కాకుండా ఆరోగ్య సమస్యగా చూడాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35 ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్ లో ఏర్పాటు చేసిన అడిక్షన్ ట్రీట్‌మెంట్ ఫెసిలిటీస్ (డీ-అడిక్షన్ సెంటర్లు) ను శనివారం గాంధీ హాస్పిటల్ నుంచి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సరైన సమయంలో చికిత్స అందిస్తే మత్తు బానిసత్వం నుంచి బాధితులను కాపాడుకోవచ్చన్నారు. ఇందులో కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రోత్సాహం చాలా అవసరమని చెప్పారు. ప్రతి సెంటర్లో స్క్రీనింగ్, ట్రీట్మెంట్, కౌన్సెలింగ్ తో పాటు ఫాలోఅప్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని మంత్రి వివరించారు.
అలాగే, రాష్ట్రం గ్లోబల్ ఫార్మా హబ్ గా ఎదిగిందని, నాణ్యత విషయంలో రాజీపడితే అంతర్జాతీయంగా మన ప్రతిష్ట దెబ్బతింటుందని మంత్రి హెచ్చరించారు. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వవద్దని ఫార్మాసిస్టులను కోరారు. అంతకుముందు గాంధీ ఆస్పత్రిలో జరిగిన ఫోరెన్సిక్ మెడిసిన్ వార్షిక సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఆరోగ్య వారోత్సవాల కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించిన హెల్త్ డిపార్ట్ మెంట్ రిపోర్టర్లను మంత్రి సత్కరించారు. ఫొటో, వీడియో జర్నలిస్టులను కూడా మంత్రి సన్మానించారు.
ప్రతి సెంటర్ లో పది బెడ్లు
ప్రతి అడిక్షన్ ట్రీట్‌మెంట్ ఫెసిలిటీస్ సెంటర్ లో పది బెడ్లు, ఐసీయూ తరహాలో మానిటర్లు, ఆక్సిజన్ వసతులు కల్పించారు. ఇందులో ఒక సైకియాట్రిస్ట్, మెడికల్ ఆఫీసర్లు, కౌన్సెలర్లు, సోషల్ వర్కర్లు, నర్సింగ్ స్టాఫ్, ఇతర సిబ్బంది అందుబాటులో ఉంటారు. డ్రగ్స్ తీసుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి, మత్తు వదిలే క్రమంలో తీవ్ర ఇబ్బందులు పడేవారికి సబ్ స్టెన్స్ ఇంటాక్సికేషన్ కేర్ యూనిట్ చికిత్స, పరిస్థితి నిలకడగా ఉండి, మత్తు నుంచి కోలుకుంటున్న వారికి -డీఅడిక్షన్ కౌన్సెలింగ్ సెంటర్ ద్వారా ఇక్కడ చికిత్స అందిస్తారు. గాంధీ హాస్పిటల్ ఏటీఎఫ్ ఇన్ చార్జి డాక్టర్ అనుపమ మాట్లాడుతూ.. గతంలో కేవలం మందులిచ్చి పంపేవాళ్లమని, ఇప్పుడు బాధితుల కోసం ప్రత్యేకంగా ఎస్ఐసీయూ ఏర్పాటు చేశామన్నారు.
